ఐటీ నోటీసులపై అహ్మద్‌ పటేల్‌ స్పందన | Ahmed Patel Reacts On IT Department Summons Over Congress Party Collections | Sakshi
Sakshi News home page

ఐటీ నోటీసులపై అహ్మద్‌ పటేల్‌ స్పందన

Published Fri, Mar 6 2020 1:08 PM | Last Updated on Fri, Mar 6 2020 7:30 PM

Ahmed Patel Reacts On IT Department Summons Over Congress Party Collections - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ స్పందించారు. రూ. 550 కోట్ల లావాదేవీలపై తనకు నోటీసులు వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరఫున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని.. త్వరలోనే ఐటీ శాఖ ఇచ్చిన సమన్లపై స్పందిస్తానని తెలిపారు. తనకు ఇ- మెయిల్‌ ద్వారా రెండు సమన్లు వచ్చాయని.. పార్లమెంటు సమావేశాల తర్వాత ఐటీ శాఖ ఎదుట హాజరవుతానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఐటీ దాడుల గురించి శుక్రవారం ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.  (చదవండి: అమరావతి నుంచి.. అహ్మద్‌ పటేల్‌కు!)

కాగా అక్టోబర్‌ 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు దేశవ్యాప్తంగా 40 చోట్ల జరిగిన ఐటీ శాఖ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, పుణెతో పాటు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న అహ్మద్‌ పటేల్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. అయితే ఆనాటి నుంచి తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అహ్మద్‌ పటేల్‌ విచారణకు హాజరుకాలేదు. కాగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేత, సీఎం కమల్‌నాథ్‌ ఇంట్లో 20 కోట్ల నగదు దొరికినట్లు ప్రచారం జరిగింది.

ఇక హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖలో రెండో విడత తనిఖీలు జరిపిన ఐటీ అధికారులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాసరావు ఇంట్లో కీలక ఆధారాలు లభించిన విషయం విదితమే. మొత్తం ఉమ్మడి ఏపీ నుంచి రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వేర్వేరు మార్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి రూ.2వేల కోట్లు చేరినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ నేపథ్యంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కంపెనీకి భారీ కాంట్రాక్టు ఇచ్చారని.. రూ.2652 కోట్ల పనులకు సంబంధించిన ఆ కాంట్రాక్టు నుంచి 20శాతం ముడుపులు పుచ్చుకునేలా ఒప్పందం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ముడుపులకు సంబంధించి ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరకడంతో వాటి ఆధారంగా... మొత్తం రూ.700 కోట్ల మేర ముడుపులకు ఒప్పందం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. వాటి ప్రకారం..ఈ మొత్తంలో ఒకే విడతలో ఏపీ ప్రముఖుడికి రూ.150కోట్ల ముడుపులు అందాయి... మిగిలిన రూ.550 కోట్ల ముడుపులు పొలిటికల్‌ ఫండింగ్‌ కోసం మరో మార్గంలో పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఏపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ముడుపులు చేరాయి. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా... అహ్మద్‌ పటేల్‌కు రూ.550 కోట్ల ముడుపులపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement