సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, తప్పుడు విధానాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది కూడా తేల్చాలని స్పష్టం చేశారు. ఈ నెల 9న ఏసీబీ డీఎస్పీ, సీఐ, సిబ్బంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరిపి.. రూ.61,500 నగదు రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్‌లో కనిపించినట్లు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. అయితే, ఏసీబీ అధికారులే బయటి నుంచి డబ్బు తెచ్చి డాక్యుమెంట్ రిజిస్టర్‌లో పెట్టారని, తాము ఎలాంటి తప్పు చేయకపోయినా కేసు నమోదు చేశారని సబ్ రిజిస్ట్రార్ తారకేష్ మంగళవారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతోపాటు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీసీ కెమెరా ఫుటేజీని సైతం ఆయన సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ తదుపరి చర్యలకు ఆదేశించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
ఈ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి.తొలుత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా అధిక రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగే ‘ఎ’ కేటగిరీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటిని అమరుస్తారు. అనంతరం ‘బి’, ‘సి’ కేటగిరీ కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేస్తారు. తదుపరి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమరుస్తారు.
డీఐజీ సస్పెన్షన్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ విశాఖపట్నం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఎ.రవీంద్రనాథ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా, బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మధురవాడ సబ్ రిజిస్ట్రారు టి.తారకేష్‌ను డీఐజీ రవీంద్రనాథ్ బదిలీ చేశారు. ప్రాథమిక ఆధారాల పరిశీలన అనంతరం డీఐజీ రవీంద్రనాథ్‌ను సస్పెండ్ చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు బుధవారం ప్రకటించారు.
తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం : ఉప ముఖ్యమంత్రి బోస్
ఇదిలావుంటే.. బుధవారం కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను సచివాలయంలో కలిశారు. తప్పు చేయకపోయినా ఏసీబీ అధికారులు తమను కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయన స్పందిస్తూ.. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, తప్పు చేయని వారికి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని అన్నారు. అనంతరం వారిని వెంటబెట్టుకుని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులే బయటినుంచి డబ్బు తెచ్చి పెట్టినట్లు పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని మంత్రి బోస్ విలేకరులకు చెప్పారు. విశాఖ రేంజ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment