సాక్షి, గుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైన తొలి అధికారిక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల ద్వారా దేవుడు అద్భుతమైన ఫలితం ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ దాటవేత ధోరణితో వ్యవహరించారు. 9 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిస్తే ముగ్గురుని ఇదే మాదిరిగా లాక్కున్నారు. మే 23న రంజాన్ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. టీడీపీ గెలిచింది కూడా 23 స్థానాల్లో మాత్రమే. అలాగే టీడీపీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. దేవుడు స్ర్కిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలకు మించిన ఊదాహరణ ఏముంటుంది?. నేను ఈ రంజాన్ మాసంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికల్లో ఐదుగురికి టికెట్ ఇస్తే.. నలుగురు గెలుపొందారు. ఓడిపోయిన ఇక్బాల్‌ను కూడా త్వరలోనే ఎమ్మెల్సీగా చేస్తామ’ని తెలిపారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను
Comments
Please login to add a commentAdd a comment