వైద్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంపై సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, జవహర్‌రెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు నాడు–నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులకు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన పనులను ఆర్ అండ్ బీకి.. సబ్‌సెంటర్ల పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే.. జిల్లా బోధనాస్పత్రుల్లో పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలన్నారు.
ప్రస్తుతం ఎటువంటి సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు, వైద్య పరికరాలను సమకూర్చడమే లక్ష్యంగా వైద్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. కార్యక్రమం అమలు పురోగతిపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విలేజ్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో చేపట్టదలచిన నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు.
సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా..
► ప్రజారోగ్య వ్యవస్థపై మనం రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం.
► దీనివల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
► ఎలాంటి సమస్యలొచ్చినా ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
► ఈ పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలి. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలి.
► ఈ పనులు ఇప్పటి వారికే కాదు.. భవిష్యత్తు తరాలకూ సంబంధించినవి.
► అందుకే పనుల్లో నాణ్యత ఉండాలి.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి.
► రాష్ట్ర చరిత్రలో ఈ పనులు చిరస్థాయిగా నిలిచిపోవాలి. నాడు–నేడు లాంటి కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుంది.
సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment