వైఎస్‌ జగన్: అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే | YS Jagan Comments On Housing Scheme Today Over Spandana Review Meeting - Sakshi
Sakshi News home page

సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా: సీఎం జగన్‌

Published Tue, Jul 7 2020 1:02 PM | Last Updated on Tue, Jul 7 2020 8:09 PM

CM YS Jagan Comments On Housing Scheme Today Spandana Review Meeting - Sakshi

సాక్షి, తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని.. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

అదే విధంగా డీ- పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇవ్వొచ్చని, అయితే డీ- పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మంచి ఆలోచనతో పని చేస్తున్నామని.. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ మంగళవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.(దీన్ని బ్లాక్‌ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ)

ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు, ఇసుక, ఉపాధి హామీ పనులు, కోవిడ్-19 నియంత్రణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. ‘‘ఏపీలో 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం. పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు.(నిర్లక్ష్యమే కారణం)

గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. అందులోనూ రూ. 1300 కోట్లు బకాయిలు పెట్టారు. అర్బన్‌ హౌసింగ్‌లో 7 లక్షల ఇళ్లు కట్టాలనుకున్నారంట. కేవలం 3లక్షల ఇళ్లు మాత్రమే కట్టడం మొదలుపెట్టారు. అవి కూడా సగంలో ఆపేశారు. ఇందుకు సంబంధించిన బకాయిలు రూ.3వేల కోట్ల రూపాయలు. పేదలకు ఇళ్లను కట్టించాల్సిన ప్రభుత్వం.. ఇంత దారుణంగా వ్యవహరించింది. కానీ, ఇవాళ 30లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నాం. ఇవన్నీకూడా ఇళ్లపట్టాలు ఇచ్చిన నెలరోజులకే ప్రారంభిస్తాం. గతానికి ఇప్పటికీ తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

వారికి 90 రోజుల్లోనే పట్టా ఇవ్వాలి..
కలెక్టర్లు ఈ పురోగతిని, కార్యక్రమంలో ముందడుగు వేసే తీరును వదిలిపెట్టవద్దు. కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో మరింత మెరుగ్గా పని చేయాలని.. ఈ పథకంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్లను కోరుతున్నా. లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలి. పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ఫ్లాట్‌ నంబర్‌ , హద్దులు పేర్కొనడం చేయాలి. ఈ  టైం గ్యాప్‌ను సద్వినియోగంచేసుకోవాలి. చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్‌ చేయించడం దీనివల్ల వీలవుతుంది. ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయండి. ఇంకా ఎవరైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోతే.. దరఖాస్తు చేస్తే, ఎంక్వైరీ చేసిన తర్వాత 90 రోజుల్లోనే పట్టా వారికి ఇవ్వాలి. జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే వారిచేత దరఖాస్తు చేయించాలి.

నాణ్యమైన ఇసుక సరఫరా చేయాలి..
ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయి. రీచ్‌ల్లోకి నీరు చేరుతోంది. వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్‌ చేయాలి. ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్‌ కలెక్టర్లు ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టిపెట్టాలి. మనకు పనులు చేసుకునే సమయం చాలా స్వల్పంగా ఉంది. హౌసింగ్‌ గాని, ఆర్బీకేలు కాని, స్కూలు భవనాలకు సంబంధించి నాడు–నేడు పనులు కాని.. వీటన్నింటిపైనా జాయింట్‌ కలెక్టర్లు ధ్యాసపెట్టాలి. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇసుక డిమాండ్‌ బ్యాక్‌లాగ్‌ను వెంటనే క్లియర్‌ చేయాలి. వచ్చే 10 రోజుల్లోగా స్టాక్‌ యార్డుల్లో పెద్ద ఎత్తున నిల్వచేయాలి. నాణ్యమైన ఇసుకను కూడా సరఫరా చేయాలి. నాణ్యమైన ఇసుకను పంపిణీ చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలకు చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వం వద్ద కూడా మీకు చెడ్డపేరు వస్తుంది. లెక్టర్లు చర్యలు తీసుకుని బ్యాక్‌లాగ్‌ తీర్చడంతోపాటు, స్టాక్‌ యార్డుల్లో పూర్తిగా నిల్వచేయాలి. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపించకూడదు.

రోజుకు దాదాపు 22-25 వేల కోవిడ్‌ టెస్టులు
‘‘రెండు మూడు టెస్టులు కూడా చేయడానికే ఇబ్బంది పడే పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఏకంగా రోజుకు సగటున 22–25వేల టెస్టులు చేయగలుగుతున్నాం. ఇప్పటివరకూ 10లక్షలకు పైగా టెస్టులు చేయగలిగాం. అధికారులకు, కలెక్టర్లకు అభినందనలు. హోం ఐసోలేషన్‌ చాలా ముఖ్యమైన అంశం. 85శాతం కేసులకు ఇంట్లోనే నయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. హోం ఐసోలేషన్‌కు రిఫర్‌ చేసే వారికి బాగా చూసుకుంటున్నామా? లేదా? మందులు సరిగ్గా అందుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించాలి. గ్రామ సచివాలయంలో ఉన్న హెల్త్‌అసిస్టెంట్, ఆశావర్కర్, ఏఎన్‌ఎం, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్‌ కంట్రోల్‌ రూం బాగా పనిచేయాలి

ఈ యంత్రాంగం మెరుగ్గా పనిచేయాలి. హోం ఐసోలేషన్‌ మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలి. హోం ఐసోలేషన్‌కోసం ఇండివిడ్యువల్‌గా ఇంట్లో ప్రత్యేక గది లేని వారికోసం కోవిడ్‌కేర్‌ సెంటర్లు పెట్టాం. ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలమీద దృష్టిపెట్టాలి. వారికిచ్చే ఆహారం, బాత్‌రూం, బెడ్ల నిర్వహణ మీద దృష్టిపెట్టాలి.  వైద్యులు పర్యవేక్షణ బాగుందా లేదా? అలాగే మందులు ఇస్తున్నారా? లేదా? ఆ మందులను కూడా జీఎంపీ ప్రమాణాలు ఉన్నవి ఇస్తున్నారా? లేదా? అన్న దాని మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అలాగే రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు, జిల్లాల్లోని కోవిడ్‌ఆస్పత్రుల్లో క్వాలిటీ మీద దృష్టిపెట్టాలి.

ప్రజల్లో చైతన్యం రావాలి
బెడ్లు, బాత్‌రూమ్స్, మెడికేషన్, ఆహారం ఈ నాలుగు అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలి. కోవిడ్‌ సెంటర్లలో నాణ్యతమీద దృష్టిసారించాలి. కోవిడ్‌తో కలిసిబతకాల్సిన సమయం. వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకూ... మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనుమానితులకోసం కూడా ఇస్తున్న క్వారంటైన్‌ సదుపాయాలు కూడా బాగుండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల సరిహద్దులు తెరిచారు. అలాగే కొన్నిచోట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తున్నాయి. దీని వల్ల సహజంగానే కేసులు పెరుగుతాయి. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

కానీ, కేసులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిపోయి వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.కోవిడ్‌ సోకినా , కోవిడ్‌ లక్షణాలు కనిపించినా.. ఒక వ్యక్తి ఎవరికి కాల్‌ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అన్నదానిపై తెలియాలి. ప్రజలందరికీ కూడా ఈ మూడు విషయాలు తెలియజేయాలి. దీనివల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. ప్రజల్లో చైతన్యం కలిగించడం మీద దృష్టిపెట్టాలి. మనం సహాయం కోసం ఇచ్చే కాల్‌ సెంటర్‌ నంబర్లు , టెలిమెడిసిన్, 108 లాంటి నంబర్లు.. సమర్థవంతంగా పనిచేయాలి. డమ్మీ చెకప్స్‌ కూడా చేయండి. మన పనితీరును కూడా మనం సమీక్ష చేసుకుని. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement