వ్యవస్థ అద్భుతం | CM YS Jagan Conference with Experts And Beneficiaries On Administration | Sakshi
Sakshi News home page

వ్యవస్థ అద్భుతం

Published Tue, May 26 2020 2:37 AM | Last Updated on Tue, May 26 2020 8:25 AM

CM YS Jagan Conference with Experts And Beneficiaries On Administration - Sakshi

పరిపాలన–సంక్షేమంపై సోమవారం జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ సీపీ ఎన్నికల మేనిఫెస్టోని ఈనెల 30వ తేదీకల్లా ప్రతి ఇంటికీ పంపిస్తాం. ఇందులో మేమేం చేశామో మీరే టిక్‌ చేయండి. ఇవన్నీ జరిగాయో లేదో మీరే గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. సంక్షేమం, వ్యవస్ధను మార్చడం, పరిపాలనలో సంస్కరణలు.. ఇవన్నీ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలుగుతున్నాం. ఇంకా మార్పులు చేస్తే గొప్పగా ఉంటుందనుకుంటే మీ సూచనలు, సలహాలు స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎలా అడుగులు వేసింది? బాగా వేశామా? ఏమైనా మార్చుకోవాల్సి ఉందా? అనేది తెలుసుకోవడం కోసమే ఈ సమీక్ష చేపట్టాం. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్న తపనతో ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశా. వ్యవస్థలో మార్పు తెస్తే తప్ప ప్రజలు అభివృద్ధి చెందరన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చేపట్టాం.   

ఇంత పద్ధతిగా తేదీలు, నెలల వారీగా ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయబోతున్నామో తెలియచేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలనే తపన బహుశా ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు
– ‘మన పాలన–మీ సూచన’లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ నవరత్నాల సంక్షేమ ఫలాలను అందించడం సంతృప్తి కలిగించిందన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించే మేనిఫెస్టోను తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు చేసి అంశాలవారీగా తేదీలతో క్యాలెండర్‌ను ప్రకటించామని చెప్పారు. దీంతో 99 శాతం హామీల అమలు దశకు చేరుకుంటామన్నారు. నవరత్నాల ద్వారా ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో 3,57,51,614 మందికి రూ.40,139.58 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించామని, గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో పేదలకు మేలు చేసిన ప్రభుత్వాలు లేవని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడంపై నిరంతరం ఆలోచిస్తామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి సహాయం అందిస్తుంటే లబ్ధిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు ఒక కిక్‌లా పని చేస్తాయని, అది ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదన్న నమ్మకం తనకుందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటై మే 30వతేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. 29వతేదీ వరకు రోజూ ఒక్కో అంశంపై సీఎం సమీక్షించనున్నారు. తొలిరోజు సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’పై నిపుణులు, లబ్ధిదారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు. ఆ వివరాలివీ..    
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మనపాలన–మీ సూచన పేరుతో జరిగిన మేథోమధన సదస్సులో మాట్లాడుతున్న విజయవాడకు చెందిన మహిళా పోలీసు శ్రావణి. చిత్రంలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్ధిదారులు 

సచివాలయాలు ఎందుకంటే?
వివక్షకు తావు లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాలన్న ఆలోచనలతో పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ. ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే పథకాలు అందాలని తపించా. పారదర్శకంగా లబ్ధిదారుల పేర్లను సచివాలయాల్లో ప్రదర్శించాం. ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకూ అందిస్తున్నాం. 

ఎంతో సంతోషం కలిగిస్తోంది
గత ఏడాది ఆగస్టు 15న వలంటీర్లను నియమించాం. అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి కేవలం వాటి ద్వారా నాలుగు నెలల్లోనే 1.45 లక్షల ఉద్యోగాలు కల్పించాం. వారిలో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీస్‌ లాంటి 10 – 12 మందిని వివిధ విభాగాలలో నియమించాం. దాదాపు 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించాం. ఇలా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించగలగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇది నిజంగా దేవుడి దయే.

తలుపుతట్టి పెన్షన్‌..
బియ్యం డోర్‌ డెలివరీని శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాం. పింఛన్లు కూడా డోర్‌ డెలివరీ చేయడం గతంలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్‌ ఇస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశాం. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వాహనమిత్ర.. ఇలా ఏది చూసినా పథకం అమలులో వలంటీర్ల పాత్ర కీలకం. కరోనా నియంత్రణ చర్యల్లో కూడా వలంటీర్లు ఎంతో బాగా పని చేశారు. 

మద్యం మహమ్మారిని నియంత్రించాం
పాదయాత్రలో నేను చూసిన మరో సమస్య.. మద్య పానం. గతంలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయించారు. మేం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. మద్యం షాపులు 33 శాతం తగ్గించాం. ఎక్కడా పర్మిట్‌రూమ్‌లు లేకుండా చేశాం. విక్రయ వేళలు తగ్గించి షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరోవైపు షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచాం. దీంతో ఐఎంఎఫ్‌ఎల్‌ లిక్కర్‌ అమ్మకాలు 23 లక్షల కేసుల నుంచి 10 లక్షలకు తగ్గాయి.

జనం కోసం.. జనతా బజార్లు
వచ్చే మార్చి నాటికి గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటవుతాయి. వాటిలో 24 గంటలూ ఔషధాలు, చికిత్స అందిస్తాం. రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తాయి. త్వరలో ఏర్పాటయ్యే జనతా బజార్లలో ప్రజలు, రైతులకు కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉంటాయి. 

ఏడాదిలో సంక్షేమం ఇలా..
► 2018 అక్టోబరు దాకా అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో కేవలం 44 లక్షలు మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు.  ఈరోజు మేం ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 58.61 లక్షలు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు దాకా ఇచ్చిన పింఛను కేవలం రూ.1,000 మాత్రమే. ఇవాళ మేం రూ.2,250 పెన్షన్‌ ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.490 కోట్లు వెచ్చిస్తే మేం నెలకు రూ.1,421 కోట్లు ఖర్చు చేసి అవ్వా తాతలకు ఇంటివద్దే చిరునవ్వుతో పెన్షన్లు అందచేస్తున్నాం.
► ‘వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర’తో సొంతంగా ఆటో ఉన్న డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం.
► ‘వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ ద్వారా దాదాపు 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్స.
► ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పథకం ద్వారా దాదాపు 50 లక్షల మందికి లబ్ధి. నాలుగేళ్లు రూ.12,500 చొప్పున ఇస్తామని ముందుగా చెప్పినా అన్నదాతలకు ఆసరాగా నిలిచేందుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇలా చెప్పినదాని కంటే ఎక్కువగానే చేస్తున్నాం. రెండో ఏడాది తొలి విడత చెల్లింపులు కూడా పూర్తి చేశాం.
► ‘వైఎస్సార్‌ నవోదయం’తో ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాల రీస్ట్రక్చర్‌. గత ప్రభుత్వం బకాయిపడ్డ రూ.960 కోట్లలో రీస్టార్ట్‌ ద్వారా మొదటి దఫా కింద మే నెలలో సగం నిధుల విడుదల. చిన్న కంపెనీలకు మేలు జరిగేలా మూడు నెలల పాటు ఫిక్స్‌డ్‌ కరెంట్‌ ఛార్జీల బిల్లులు రద్దు. 
► అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.264 కోట్ల చెల్లింపులు. కోర్టు అనుమతిచ్చిన మేరకు రూ.పదివేల లోపు డిపాజిట్‌దారులందరినీ ఆదుకున్నాం.
► మనబడి నాడు –నేడు పనులకు శ్రీకారం. జూలై నాటికి తొలిదశలో 15,700 స్కూళ్ల రూపురేఖలు మార్పు. 
► ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ సర్వేకి శ్రీకారం. బియ్యం కార్డులకు ఆదాయ అర్హత రెట్టింపు.
► మత్స్యకార భరోసాకు శ్రీకారం.
► ఆరోగ్యశ్రీ రూపురేఖలు సంపూర్ణంగా మార్పు. మే 18 వరకు బకాయిలన్నీ క్లియర్‌.
► వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చెల్లింపు. దీనిద్వారా దాదాపు లక్ష  మందికిపైగా లబ్ధి.
► వైఎస్‌ఆర్‌ లా నేస్తం, మహిళల భద్రత కోసం దిశ చట్టం. 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాట్లు.
► వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా 81 వేల మంది చేనేతన్నలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం.
► ఆరోగ్యశ్రీ ద్వారా 2 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందించే పైలెట్‌ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభం. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి 1,200 వ్యాధులకు విస్తరణ. 
► అమ్మ ఒడి ద్వారా రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ.
► జగనన్న వసతి దీవెన పథకం ద్వారా తొలిదఫాలో రూ.1,200 కోట్లు చెల్లింపులు.
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చరిత్రలో తొలిసారిగా మార్చి త్రైమాసికం వరకు కాలేజీలకు బకాయిలు క్లియర్‌. గత ప్రభుత్వం మిగిల్చిన రూ.1,800 కోట్ల మేర ఫీజుల బకాయిల చెల్లింపు. ఇక తల్లులకే నేరుగా డబ్బులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం. వైఎస్‌ఆర్‌ విద్యా దీవెన కూడా ఏప్రిల్‌లోనే ఇచ్చాం.
► ఈ ఏడాది ఏప్రిల్‌లో పొదుపు సంఘాలకు రూ.1,400 కోట్ల మేర వడ్డీలేని రుణాలు.  వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించడం ద్వారా స్వయం సహాయ సంఘాలకు చేయూత. దాదాపు 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం. 
► అర్చకులు, ఇమామ్‌లు, మౌజంలు, పాస్టర్లకు వన్‌టైం ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ కింద రూ.ఐదు వేలు చొప్పున మే 26వ తారీఖున అందచేస్తాం.
► మే 30 వ తేదీన రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం. 

జూన్, జూలైలో ఇలా
► జూన్‌ 4వ తేదీన వాహనమిత్ర కార్యక్రమం ప్రారంభం. 
► జూన్‌ 17న నేతన్న నేస్తం రెండో విడత సాయం. గత ప్రభుత్వం మిగిల్చిన ఆప్కో బకాయిలు చెల్లిస్తాం.
► జూన్‌ 24న వైఎస్‌ఆర్‌ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించి 45 – 60 ఏళ్ల లోపు మహిళలకు రూ.15 వేలు చొప్పున అందచేస్తాం.
► జూన్‌ 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.400 కోట్లకు పైగా చెల్లింపు.
► జూలై 1వతేదీన 1,060 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభిస్తాం.
► జూలై 8వ తేదీన వైఎస్సార్‌ జయంతి సందర్భంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ.  
► జూలై 29న రైతులకు వడ్డీలేని రుణాలను అందించే కార్యక్రమం ప్రారంభం.

ఆగస్టు నుంచి ఇలా సాయమందిస్తాం
► ఆగస్టు 3వతేదీన విద్యాకానుక ద్వారా 40 లక్షల మంది స్కూలు పిల్లలకు  ఉచితంగా స్కూల్‌ బ్యాగు, బట్టలు, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్,, సాక్స్‌లు అందించే కార్యక్రమం ప్రారంభం. గిరిజనులకు మేలు చేసేందుకు ఆగష్టు 9న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చే కార్యక్రమానికి నాంది. 
► ఆగష్టు 12న వైఎస్‌ఆర్‌  చేయూత ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కకు తోడుగా నిలుస్తాం. 45 – 60 ఏళ్లు వయస్సున్న ప్రతీ అక్కకూ రూ.18,750 చొప్పున ఇస్తాం. నాలుగేళ్లలో రూ.75,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
► ఆగష్టు 19న జగనన్న వసతి దీవెన కింద ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ.10 వేలు చొప్పున సాయం.
► ఆగష్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.
► సెప్టెంబర్‌ 11వ తేదీన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి దఫా సాయం.
► సెప్టెంబర్‌ 25న విద్యాదీవెన ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం.
► అక్టోబర్‌లో రైతు భరోసా రెండో విడత కింద రైతులకు రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తాం.
► అక్టోబరులో చిరు వ్యాపారులుకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా రూ.10 వేలు సున్నావడ్డీకే అందచేసి కార్డులిస్తాం. వడ్డీని ప్రభుత్వమే కట్టే విధంగా పది లక్షల మందికి మేలు చేస్తాం.
► నవంబర్‌లో విద్యాదీవెన, డిసెంబరులో అగ్రిగోల్డ్‌ బాధితులకు, జనవరి 9 తేదీన మరలా అమ్మఒడి కార్యక్రమం, ఫిబ్రవరిలో మళ్లీ విద్యాదీవెన, వసతి దీవెన, మార్చిలో  పొదుపు సంఘాలకు మళ్లీ వడ్డీలేని రుణాలిచ్చే కార్యక్రమాలను చేపడతాం. 

ఏడాదిలో ఎంతమందికి లబ్ధి?
► 2019న మే 30 మన ప్రభుత్వం ఏర్పడింది. ఈనెల 20వతేదీ దాకా చూసుకుంటే 3,57,51,614 మందికి లబ్ధి కలిగింది. రూ.40,139.58 కోట్లు ఖర్చు చేశాం.
► లబ్ధిదారుల్లో బీసీలు 1,78,42,048 మంది ఉండగా వారికి రూ.19,298 కోట్లు అందచేశాం.
► 61,26,203 మంది ఎస్సీలకు రూ.6332 కోట్లు, 18,39,451 మంది ఎస్టీలకు రూ.2,108 కోట్లు ఇచ్చామని గర్వంగా చెప్పగలుగుతున్నాం.
► 18,61,863 మంది మైనార్టీలకు రూ.1701 కోట్లు అందించాం.
► ఇతరులు 77,47,889 మంది కోసం రూ.10,462 కోట్లు ఖర్చు చేశాం.

వలంటీర్లకు లెర్నింగ్‌ యాప్‌
► కార్యక్రమం ఆరంభంలో ప్రజా సంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారం వీడియోలను ప్రదర్శించారు.
► గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం ఒక యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌తోపాటు,  వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement