కొత్తగా పదేసి ఉద్యోగాలు  | CM YS Jagan Directions on village secretariat system in Collectors Conference | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా పదేసి ఉద్యోగాలు 

Jun 25 2019 4:22 AM | Updated on Jun 25 2019 10:47 AM

CM YS Jagan Directions on village secretariat system in Collectors Conference - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు గ్రామ, వార్డు స్థాయిల్లో ఇప్పుడు పనిచేసే ప్రభుత్వ సిబ్బంది పదేసి మంది లేనిచోటే కొత్త నియామకాలు చేయాలని ప్రతిపాదనలు అందించగా.. ఇప్పుడు పనిచేస్తున్నవారు కాకుండా పదేసి మందిని కొత్తగా నియమిస్తామని సీఎం చెప్పారు. ఇప్పుడు పనిచేస్తున్నవారు వివిధ వ్యవహారాలపై బయట తిరుగుతూ ఉంటారని, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించే పదేసి మంది ఉద్యోగులు నిరంతరం సచివాలయాల్లోనే ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా ఉండే వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల నుంచి తీసుకొచ్చే వినతులను 72 గంటల్లో సంబంధిత శాఖలను సంప్రదించి పరిష్కరించడమే పదేసి మంది ఉద్యోగుల ప్రధాన కర్తవ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తమ గ్రామంలో నాణ్యమైన ఐఎస్‌ఐ విత్తనాలు కొనుగోలు చేసేలా పరీక్షల ద్వారా నిర్ధారించడం వంటివి వీరి విధుల్లో ఒకటిగా ఉంటాయన్నారు. 

కింది స్థాయిలో ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలనే.. 
కనీసం రెండు వేల జనాభా ఉండే ప్రతి ఊరిలో గ్రామ సచివాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొందరు కలెక్టర్లు ప్రతి 5,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని గ్రామ పంచాయతీలుగా వర్గీకరించి, అక్కడ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రభుత్వంలో ఈ అంశంపైనా లోతుగా చర్చ జరిగిందని, చాలా కింది స్థాయిలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలనే లక్ష్యంతోనే గ్రామ సచివాలయానికి కనీస జనాభా 2000 మంది ఉండేలా నిర్ణయించినట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు పెద్ద ప్రాంతంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన పట్టణాల్లో వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలనేది మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు కలిపి దాదాపు లక్షన్నర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశముందన్నారు.  

తొలగింపునకు గురైన ఉద్యోగులకు వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యం
అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి కాకుండా, అభ్యర్థుల్లో సేవాదృక్పథం, నిజాయతీ ప్రాతిపదికన వలంటీర్ల ఎంపిక ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వలంటీర్ల నియామకంపై కలెక్టర్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. మండల స్థాయిలో ఎంపీడీవో నేతృత్వంలో ముగ్గురు కమిటీ సభ్యులు నిర్వహించే వలంటీర్ల ఇంటర్వూ్యల్లో అభ్యర్థిలో సేవా దృక్పథాన్ని, నిజాయతీని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అక్షరభారత్‌ వంటి కార్యక్రమాల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగించడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో వంద కుటుంబాలకు ఒక వలంటీర్‌ అనే నిబంధన అన్ని చోట్ల ఒకే విధంగా అమలు చేయొద్దన్నారు. పేదల కుటుంబాలు కొద్ది దూరంలో విస్తరించి ఉన్నప్పుడు అలాంటి చోట పట్టణాల్లో 50 ఇళ్లకే వలంటీర్‌ను నియమించాలని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement