గత ఐదేళ్లుగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ సుమారు రూ.4,800 కోట్లు పెండింగ్‌లో ఉంది.ఈ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కేటగిరీ వారీగా ఈ ఇన్సెంటివ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాలి. రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలి. ప్రతి పరిశ్రమ నుంచి వచ్చే పొల్యూషన్‌ను జీరో స్థాయికి తీసుకురావాలి. పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి, కాలుష్యం లేకుండా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుంది.
సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక విధానం వాస్తవిక దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి.. పారిశ్రామిక కాలుష్య నివారణ, ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు, పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్స్ చెల్లింపునకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై కోవిడ్–19 ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
కాలుష్య నివారణకు పెద్దపీట
► సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా కాలుష్య నివారణ విధానం ఉండాలి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి.
► పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున, దీనిపై మరింతగా దృష్టి పెట్టాలి.
► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు తోడ్పాటు
► గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని మాటలు చెప్పి, చివరకు ఏదీ చేయని పరిస్థితి ఉండకూడదు. మనం చెప్పే మాటలపై పరిశ్రమలు పెట్టేవారికి విశ్వాసం ఉండాలి.
► పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇద్దాం. వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దాం.
► భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై వివరాలు తయారు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ – మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) మరింత తోడ్పాటునందించే దిశగా అడుగులు ముందుకు వేయాలి.
► కోవిడ్–19 నేపథ్యంలో మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పుల కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్ధికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపై కసరత్తు చేయాలి. (కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని అంచనా వేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.)
Comments
Please login to add a commentAdd a comment