పర్యాటకానికి రాష్ట్రం పర్యాయ పదం | CM YS Jagan In high level review on tourism development | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి రాష్ట్రం పర్యాయ పదం

Published Sat, Jun 20 2020 4:38 AM | Last Updated on Sat, Jun 20 2020 8:41 AM

CM YS Jagan In high level review on tourism development - Sakshi

పర్యాటక రంగం అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాయ పదం కావాలని, ఇందుకు అనుగుణంగా  వెంటనే కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశలో టూరిజమ్‌ ట్రేడ్‌ రెగ్యులేషన్‌ ప్రక్రియ కొనసాగాలని, పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్‌ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్దేశించారు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు. మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిపాదనలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

కొత్త టూరిజమ్‌ పాలసీ  
► ఈ ఏడాది మార్చి 31తో రాష్ట్రంలో పర్యాటక విధానం ముగిసినందున వెంటనే కొత్త విధానాన్ని రూపొందించాలి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాయ పదం అనే దిశలో కొత్త విధానం ఉండాలి. 

రెగ్యులేషన్‌ ఆఫ్‌ టూరిజమ్‌ ట్రేడ్‌  
► పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల వెంటనే అన్నింటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలి. 
► పర్యాటక రంగంలో ఉన్న టూర్‌ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజమ్‌ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, ఆయా చోట్ల ఉన్న సదుపాయాలు వంటి అన్నింటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. 

శిల్పారామాల అభివృద్ధి 
► రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శిల్పారామాలను పునఃసమీక్షించాలి. వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు తగు  చర్యలు తీసుకోవాలి. వాటిలో పదే పదే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ దిశగా వాటి అభివృద్ధితో పాటు అవసరమైన మార్పులు చేయాలి. 
► సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 

7 స్టార్‌ సదుపాయాలు ఉండాలి  
► విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే అన్ని చోట్ల 7 స్టార్‌ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేయాలి.  
► రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇచ్చి, వారి ప్రతిపాదనలను కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే దేన్నైనా ఖరారు చేయాలి. 
► పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వచ్చేలా విధి విధానాలు ఉండాలి. కనీసం 10–12 ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల పూర్తి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలి. 
► రాజస్థాన్‌కు ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు వెళుతున్నారని పరిశీలిస్తే అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయి. అందువల్ల అదే స్థాయిలో రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాల్లో మంచి వసతులతో హోటళ్లు ఏర్పాటు కావాలి.  
► ప్రస్తుతం ఏయే జిల్లాలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి..5 స్టార్‌ ఎన్ని? 4 స్టార్‌.. 3 స్టార్‌.. 2 స్టార్‌.. సింగిల్‌ స్టార్‌ హోటళ్లు ఎన్నున్నాయో గుర్తించి వాటిని మ్యాపింగ్‌ చేయాలి. వాటి వివరాలు టూరిస్టులకు అందుబాటులో ఉంచాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement