ఉపాధి కల్పనే.. గీటురాయి | YS Jagan Mohan Reddy High Level Review On Industrial Policy | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనే.. గీటురాయి

Published Fri, Jul 3 2020 5:05 AM | Last Updated on Fri, Jul 3 2020 8:22 AM

YS Jagan Mohan Reddy High Level Review On Industrial Policy - Sakshi

పరిశ్రమలకే ప్రోత్సాహకాలు అందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనే పరిశ్రమల లక్ష్యం కావాలని, ఆ దిశగా ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకే ప్రోత్సాహకాలు అందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంత మందికి ఉపాధి లభించిందనే అంశం ఆధారంగానే వాటికి రాయితీలు ఇవ్వాలన్నారు. స్థానికంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సూక్ష్మ, చిన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. వాటికి పునరుద్ధరణ, చేయూత ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో 2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష
పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఐటీ రంగంలో ఈ యూనివర్సిటీ గొప్ప మలుపు అవుతుంది. ఈ యూని వర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, బోధన అంశాలపై ప్రఖ్యాత ఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్స్‌టెన్షన్‌ మోడల్స్‌పై దృష్టి పెట్టాలి. పరిశ్రమలు పెట్టే వారికి ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీలు ఇచ్చేలా పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి. స్థానికులను వాచ్‌మెన్, అటెండర్లుగా తీసుకుని.. వారికి శిక్షణ ఇచ్చి పై స్థాయికి  తీసుకెళ్తే మరింత బోనస్‌ ఉండాలి.

కాలుష్య నివారణ  చాలా ముఖ్యం 
►కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్థాలు వాతావరణంలోకి రాకుండా చూడడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం బలోపేతమైన విధానాలను పాటించాలి.  
► ఉద్యోగాల కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధిని సాధించడంపై పారిశ్రామిక పాలసీ దృష్టి సారిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మరింత మెరుగ్గా నడిచేలా చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులపైనా దృష్టి పెడుతున్నామన్నారు.  
► మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక చర్యల ద్వారా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల స్థాపన కాలాన్ని తగ్గించడంలో భాగంగా మౌలిక సదుపాయాల వృద్ధి, వెనుకబడిన వర్గాల సామాజికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు పారిశ్రామిక పాలసీలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement