
‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ‘కనెక్ట్ టు ఆంధ్రా’ కింద రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ప్రత్యేకించి ఈ వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని.. రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ‘మీరు ఎంత సాయం చేస్తారన్నది ముఖ్యం కాదు.. మీ గ్రామంలో.. లేదా మీ నియోజకవర్గంలో.. లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమమైనా చేపట్టొచ్చు.. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సాయం చేయొచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాంతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన కమిషనర్ విజయ్‌కుమార్, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment