తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నపుడు తాను ఒక తండ్రిలాగా ఆలోచించాల్సి ఉంటుందని ఆయనన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ.. అమరావతి అనేది అటు విజయవాడ, ఇటు గుంటూరు కాదని.. అసలు ఆ ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజి, పైపులైన్లు లేవన్నారు.
అక్కడ మౌలిక సదుపాయాలకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, దీని కోసమే రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్న వారే లెక్కగట్టారని గుర్తుచేశారు. ఇప్పటికి అమరావతిపై ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనని, ఇంకా రూ.2,297 కోట్ల బకాయీలు చెల్లించాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టాల్సిన చోట రూ.6 కోట్లు పెడితే అది సముద్రంలో నీటిబొట్టే అవుతుందని ఐదేళ్ల తరువాత మళ్లీ మన పరిస్థితి ఏమిటి? ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడకు పోవాలి? అని ప్రశ్నించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుపైనే మన పిల్లలు ఆధారపడాలన్నారు. అదే ఖర్చులో 10 శాతం విశాఖపట్టణంలో పెడితే బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్–1 నగరంగా విశాఖ ఉందని ఆయన రైతులకు విపులంగా వివరించారు. కనీసం రానున్న కాలంలో నైనా మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఏమేం కావాలో చెప్పండి
తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా చేయడానికి రూ.1,100 కోట్లు ఖర్చవుతుందని.. ఇలాంటి వాటిని వదిలిపెట్టి ఎంత పెట్టినా కనిపించని చోట రూ.లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం?.. అయినా సరే ఎవరికీ అన్యాయం జరక్కుండా ఇక్కడే లెజిస్లేటివ్ రాజధానిని కొనసాగిస్తామని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధాని పెడతామని వైఎస్ జగన్ చెప్పారు. తన ముందు ఇవాళ రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ నెరవేర్చడం ప్రభుత్వం కనీస బాధ్యత అని సీఎం అన్నారు. రాజధాని గ్రామాల్లో ఏమేం కావాలో చెప్పాలని.. 2, 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఈ గ్రామాల్లో పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. అలాగే, రాజధాని గ్రామాల్లో పెన్షన్లు అందని అర్హులు ఎవరైనా ఉంటే వారందరినీ వలంటీర్ల ద్వారా గుర్తించాలని ఆయన చెప్పారు.
చంద్రబాబు మాపై కక్ష గట్టారు
సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ.. వాస్తవానికి తమవి చాలా సారవంతమైన భూములని, అలాంటి చోట చంద్రబాబు రాజధాని కడతానని ప్రకటించి తమను భయపెట్టడంతో చాలామంది రైతులు భూములిచ్చారని తెలిపారు. భూములివ్వని వారిపై చంద్రబాబు కక్షగట్టి లిఫ్ట్ ఇరిగేషన్‌ను కట్‌చేసి కరెంటు తీసేశారన్నారు. మూడు చెక్‌పోస్టులు పెట్టి వ్యవసాయం చేసుకోనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడమే గాక తమ పొలాలను కూడా తగలబెట్టారని వాపోయారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా తమకు అన్ని సేవలు అందుతున్నాయి కనుక పాలన ఎక్కడ నుంచి సాగినా ఇబ్బందిలేదని రైతులు స్పష్టంచేశారు. భూమిలేని వారికి పెన్షన్‌ను రూ.5వేలకు పెంచడం చాలా మంచి నిర్ణయమన్నారు. (చదవండి: వెనకుండి నడిపిందెవరు?)
వారు ఇంకా ఏమేం ప్రస్తావించారంటే..
- సీఆర్డీయేను తీసేస్తే తమ పొలాలు బాగుంటాయి. గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
- ఇప్పుడున్న కరకట్టను వెడల్పు చేసి అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలి.
- భూసేకరణ నోటిఫికేషన్‌ను ఎత్తివేయాలి. దీనివల్ల ఏమీ చేయలేకపోతున్నాం. బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడంలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం.
- జోన్లు ఎత్తివేయాలి. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’)
Comments
Please login to add a commentAdd a comment