![CM YS Jagan Mohan Reddy Review Meeting On Town Development Projects In Amaravati - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/27/CM-YS-JAGAN_4.jpg.webp?itok=5hiKCdFT)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నడుస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నానికి నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అమృత్ పథకం కింద దాదాపు రూ. 3,762 కోట్లతో పనులు చేపట్టామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించారు. రూ.800 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (సాయం అర్ధించిన విద్యార్థిని, చలించిన సీఎం జగన్)
టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలి:
విజయవాడలోని నీటి కాలువల్లోకి చెత్త వేయకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్మార్ట్‌సిటీ కింద రూ. 4,578 కోట్ల విలువైన పనులు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో చేస్తున్నామని, వాటిని వేగంగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏఐఐబీ ఆర్థిక సహాయంతో 50 పట్టణ ప్రాంతాల్లో, లక్ష జనాభా కన్నా తక్కువ ఉన్న నగరాల్లో తాగునీటి కోసం రూ. 5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పట్టణాలకు వెళ్లే దారిలో ఉన్న 111 గ్రామాలకు తాగునీరు అందించాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని జులై 8న లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రైల్ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయలన్నారు. కోవిడ్ కారణంగా డీపీఆర్ తయారీలో కాస్త వెనకబడ్డామని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. (అది పిల్లల భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్)
ఆధునిక వసతులు సమకూర్చాలి:
లక్ష జనాభా దాటిన పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఉద్దేశించిన రూ.10,666 కోట్లతో కార్యక్రమాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను మోడల్ మున్సిపాలిటీలుగా చేయడంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. వంద శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. పాఠశాలల అభివృద్ది, నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ఉండాలని సీఎం తెలిపారు. అలాగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంపైనా అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణంపైన సమావేశంలో సీఎం జగన్ చర్చించారు.
పేదలకు కట్టే ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళగిరి ఆలయ అభివృద్ధి, మాడ వీధుల పునర్నిర్మాణంపైన సమావేశంలో సీఎం అధికారులతో చర్చించారు. బకింగ్‌హాం కెనాల్ డెవలప్‌మెంట్, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ది తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆధికారులు ప్రతిపాదించారు. వీటన్నింటికీ జూన్ నాటికి పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment