బోస్‌కు సముచిత స్థానం | CM YS Jagan Nominates Pilli Subhash Chandra Bose To Rajya Sabha | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకు విలువనిచ్చిన వైఎస్‌ జగన్‌

Published Tue, Mar 10 2020 8:10 AM | Last Updated on Tue, Mar 10 2020 8:33 AM

CM YS Jagan Nominates Pilli Subhash Chandra Bose To Rajya Sabha - Sakshi

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

సాక్షి, రాజమహేంద్రవరం: నైతిక విలువలు కోల్పోయి కలుషితమైన రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి విశ్వసనీయతకు పెద్ద పీట వేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తరువాత నమ్మిన సిద్ధాంతం కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు సీఎం పెద్దల సభకు పంపించేందుకు నిర్ణయించారు. అధిష్టానం అంటే వైఎస్సేనంటూ పదవులపై వ్యామోహం లేదంటూ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచిన బోస్‌కు సముచిత స్థానం లభించింది. రాజకీయాలలో తొలినాళ్ల నుంచి మహానేత రాజశేఖర్‌రెడ్డి నమ్మిన వారిలో ఒకరిగా బోస్‌ గుర్తింపుపొందారు. (కీలక ఘట్టం; సగం బీసీలకే)

వైఎస్‌ మరణానంతరం కూడా ఆయన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిస్తూవచ్చారు. 2010లో మారిన రాజకీయ పరిణామాల్లో బోస్‌ వైఎస్సార్‌ కుటుంబానికి అండగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియానే ధిక్కరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్ధాపించినప్పటి నుంచీ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోను 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లోను బోస్‌ రామచంద్రపురంనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాటి ఎన్నికల్లోనే సముచిత స్థానం కల్పిస్తానని జగన్‌ ప్రకటించారు. ఆ తరువాత 2016లో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారందరినీ పక్కనబెట్టి బోస్‌కే కేటాయించి రాజకీయాల్లో చాలా అరుదుగా వినిపించే విశ్వసనీయత, విలువలు, ఇచ్చిన మాటకు కట్టుబడటమనే పదాలకు జగన్‌ నిదర్శనంగా నిలిచారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టిక్కెట్‌ను కేటాయించి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో బోస్‌ ఓటమి చెందినప్పటికీ జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలి కేబినెట్‌లోనే స్ధానం కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. అంతటితోనే ఆగకుండా కీలకమైన రెవెన్యూశాఖను కూడా కేటాయించి మండలి నేతగా కూడా ప్రాతినిధ్యం కల్పించారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులను అడ్డుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ శాసన మండలిని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేయగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న బోస్‌ తన పదవి పోతుందనే ఆలోచన కూడా లేకుండా శాసన మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సంచలన నిర్ణయాన్ని తీసుకుని జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడిగా నిలిచారు.  

శెట్టిబలిజలకు సముచిత స్థానం 
రాష్ట్ర విభజనకు ముందు విభజన తరువాత ఏపీలో బీసీలలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి తొలిసారి పెద్దల సభకు అవకాశం ఇచ్చిన సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. జిల్లాలో బీసీలను ఓటుబ్యాంక్‌గానే పరిగణించిన టీడీపీ  ఈ స్థాయి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడూ కల్పించలేకపోయింది. జిల్లా నుంచి తొలిసారి రాజ్యసభకు కాపు సామాజిక వర్గం నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత  ప్రాతినిధ్యం వహించారు. తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్‌ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాజ్యసభకు నామినేట్‌ చేయటంలో బీసీ వర్గాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీలకు సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పటమే కాకుండా ఏకంగా రాజ్యసభకు బోస్‌ను పంపించేందుకు నిర్ణయించడంపై ఆ సామాజికవర్గంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. 

విశ్వసనీయతకు విలువనిచ్చిన సీఎం 
ముఖ్యమంత్రి విశ్వసనీయతకు విలువ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంతటి స్థాయి కల్పిస్తారని ఎప్పుడూ ఊహించ లేదు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎప్పుడూ చెబుతుండే సీఎం దానిని కార్యచరణలో చూపించారు. (వైఎస్సార్‌సీపీలోకి డొక్కా, రెహమాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement