రామచంద్రపురం: ‘పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వైఎస్సార్‌సీపీ నా సొంత పార్టీలా భావిస్తాను. ఇటీవల కొన్ని పత్రికలు, చానల్స్‌లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు...’ అని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టంచేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదేవిధంగా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పానని వివరించారు. ఇది బాధాకరమైన విషయమన్నారు.
ఈ అంశంపై మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం చెప్పిందని వెల్లడించారు. నియోజకవర్గంలో పరిపూర్ణమైన సర్వేలు జరిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. అంతవరకు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించిందని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ పని చేస్తానన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కార్యకర్తల్లో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటానన్నారు. పార్టీ నిర్మాణం, ఓదార్పుయాత్రలో తాను ప్రముఖ పాత్ర పోషించానన్నారు. త్వరలోనే తమ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్‌ను ముగించాలని మీడియాకు బోస్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment