సాక్షి, అమరావతి: జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. (అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్)
పదేపదే గుర్తుంచుకోవాలి..
‘నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి. నూటికి నూరు శాతం కచ్చితంగా ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదేపదే గుర్తుంచుకోవాలి. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తాను. ఇంటిపట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని’ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని సీఎం పేర్కొన్నారు. సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తానని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలని సీఎం తెలిపారు. పెన్షన్ కార్డుకు 10 రోజులు, రేషన్ కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలన్నారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వివక్ష లేకుండా, సంతృప్తస్థాయిలో అందాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ భేటీ)
ఉపాధి హామీ పనులు
ఉపాధిహామీ కింద భారీగా పనులు కల్పించాలని కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్ వాడీ కేంద్రాల మీద పూర్తిగా ధ్యాస పెట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగించంచాలని, వెంటనే పనులు మొదలు పెడతారన్నారు. నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదని.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ‘55 వేల అంగన్‌వాడీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. భవనాలు ఉన్నచోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం.సొంతంగా భవనాలు లేనిచోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటికోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీచేయాలని’ సీఎం ఆదేశించారు.
పచ్చతోరణం
పచ్చదనం పెంపునకు ‘జగనన్న పచ్చతోరణం’ కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యమని సీఎం తెలిపారు. నాడు నేడు కింద, ఖాళీ స్థలాల్లో, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమం, అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వనున్న లే అవుట్స్‌లో కూడా బాగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఇళ్లపట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కులు ఇవ్వాలని సీఎం సూచించారు.
వార్డు క్లినిక్స్
పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం చేపట్టాలన్నారు. 2 కి.మీ పరిధిలో, కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లేదూరంలో వార్డు క్లినిక్స్ నిర్మాణం చేయాలని దీనికోసం స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం:
‘ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి ఉంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఈపనులు పూర్తి చేయాలి. ఫర్నిచర్, ఫ్యాన్లు అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తికాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు – నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలి. అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు– నేడుకు నిధుల కొరతలేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని ఈ స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాల’ని సీఎం ఆదేశించారు.
ఇసుక
వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వచేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. రోజువారీ అవసరాలను తీరుస్తూనే.. వర్షాకాలంలో అవసరాల కోసం ఈ ఇసుకను నిల్వచేశామని తెలిపారు. నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వచేయాలని సీఎం సూచించారు. ‘వచ్చే రెండు వారాల్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన ఇసుకను ఇప్పటికే నిల్వచేసుకోవాలి. శ్రీకాకుళం 20 వేలు, తూర్పుగోదావరి 60 వేలు, పశ్చిమగోదావరి 35 వేల టన్నులు, కృష్ణా 50 వేల టన్నులు, గుంటూరు 40 వేల టన్నులు ప్రతి రోజూ ఇసుకను ఉత్పత్తి చేయాలని’ సీఎం పేర్కొన్నారు. ఏమీ చేయకపోయినా.. ఏదోరకంగా వేలెత్తిచూపిస్తారన్నారు. వర్షాలు కురిసేలోగా ఇసుకను నిల్వచేయాలని, ఈ ఇసుకే వచ్చే కాలంలో వినియోగపడుతుందన్నారు.
థర్డ్ ఆర్డర్ నదుల నుంచి, వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment