సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : ప్రస్తుతం ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంత తక్కువ ఖర్చుతో వేడుక నిర్వహించాలన్నా పెళ్లికి బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం ఇలా పెళ్లి భజంత్రీ మోగే వరకూ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చలేక జీవితాంతం సతమతమవుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాల రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. ముఖ్యంమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి మండల మహిళా సమాఖ్యలు, మెప్మా కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పథకానికి మార్గదర్శకాలు..
► వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
► వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.
► ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
► వివాహం ఏపీలోనే చేసుకోవాలి.
► ఇద్దరికీ ఆధార్‌కార్డు, వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.
► వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి.
► వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
► తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.
► వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.
నమోదు ఇలా..
మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్లి కానుక దరఖాస్తును నమోదు చేస్తున్నారు. నమోదుచేసిన వెంటనే అప్లికేషన్ ఐడీ నంబర్ అభ్యర్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి, దర్యాప్తుచేస్తారు. ఆ తర్వాత ముందుగా రావాల్సిన 20శాతం నగదును పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు
♦ మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, జనన ధ్రువీకరణ పత్రం.
♦ వయస్సు నిర్ధారణకు పదో తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ–సేవా సర్టిఫికెట్.
♦ కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
♦ తెల్లరేషన్ కార్డు లేదా మీ–సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
♦ పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను ఇవ్వాలి.
♦ దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం కలిగిఉండాలి).
♦ భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు.
♦ ‘వెలుగు’లోనే దరఖాస్తు చేయాలి
జగనన్న భరోసా ఇలా..
కేటగిరి | గత ప్రభుత్వం | ప్రస్తుతం |
ఎస్సీ | రూ. 40 వేలు | రూ.లక్ష |
ఎస్టీ | రూ. 50 వేలు | రూ.లక్ష |
బీసీ | రూ. 35 వేలు | రూ.లక్ష |
మైనార్టీలు | రూ. 50 వేలు | రూ.లక్ష |
భవన నిర్మాణ కార్మికులకు | రూ. 20వేలు | రూ. 20వేలు |
ఎస్సీ కులాంతర వివాహం | రూ. 75 వేలు | రూ. లక్ష |
ఎస్టీ కులాంతర వివాహం | రూ. 50 వేలు | రూ. లక్ష |
బీసీ కులాంతర వివాహం | రూ. 50 వేలు | రూ. 50 వేలు |
దివ్యాంగులకు | రూ. లక్ష | రూ. లక్ష |
వైఎస్సార్ పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నేరుగా మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించాలి. మా వద్దకు దరఖాస్తు వచ్చిన వెంటనే ఐడీ నంబర్ ఇస్తాం. ఈ నంబర్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్ కూడా లబ్ధిదారునికి సకాలంలో తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు మండలంలో 47 వివాహాలు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే వధువుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ పెళ్లి కానుక నగదు జమ చేస్తాం.
– వి నాగేశ్వరరావు, ఏపీఎం వెలుగు కార్యాలయం, యడ్లపాడు
Comments
Please login to add a commentAdd a comment