3 నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ | CM YS Jaganmohan Reddy Review Meeting On Higher Education | Sakshi
Sakshi News home page

3 నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Published Tue, Mar 10 2020 3:07 AM | Last Updated on Tue, Mar 10 2020 9:57 AM

CM YS Jaganmohan Reddy Review Meeting On Higher Education  - Sakshi

ప్రతి విద్యార్థి పూర్తి పరిజ్ఞానం, నైపుణ్యాలతో బయటకు వచ్చేలా ఆయా విద్యా సంస్థలు నడవాలి. అందుకే ఉన్నత విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం. విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దు.  
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని, ఈ దిశగా ప్రతి మూడు నెలలు (తైమాసికం) పూర్తి కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇలా ఎప్పుటికప్పుడు చెల్లింపుల వల్ల కాలేజీలకు కూడా మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌.. కాలేజీ ఫీజుల ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘మంచి చదువులు పిల్లలకు భారం కాకూడదు. ప్రభుత్వానికి కూడా భారం కాకూడదు. అదే సమయంలో మనం రూపొందించుకొనే విధానాలు దీర్ఘకాలం అమలు కావాలి. కాలేజీలు తమ కార్యకలాపాలను ప్రశాంతంగా, సాఫీగా ముందుకు తీసుకువెళ్లాలి. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలి. అందుకోసం విద్యార్థుల చదువులకయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించిన మొత్తాలను కూడా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్చి 30 నాటికి ఈ చెల్లింపులు చేసేలా అడుగులు వేస్తున్నాం’ అని అన్నారు. 
ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

పేద పిల్లలకు ఉన్నత చదువులే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మంచి చదువు అందాలని.. అప్పుడే వారు పరిపూర్ణ పరిజ్ఞానం, నైపుణ్యాలతో పోటీ ప్రపంచంలో నెగ్గుకొని రాగలుగుతారని సీఎం అన్నారు. ఉన్నత చదువులతోనే వారి భవిష్యత్‌ బంగారు మయం అవుతుందని చెప్పారు. ఇలాంటి మంచి చదువులను అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నామని చెప్పారు. తద్వారా కాలేజీల్లోని సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆయా సంస్థలకు వీలు కలుగుతుందని, బోధనాభ్యసన కార్యకలాపాలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగించగలుగుతాయని అభిలషించారు. ఇందుకోసం రాష్ట్రంలో సస్టెయినబుల్‌ (స్థిరమైన) ఫీజుల విధానం ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

నాణ్యతలో రాజీపడొద్దు..
ప్రతి ఒక్క కాలేజీ నిబంధనలను పాటిస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాణ్యతలో రాజీపడొద్దని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఏపీలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement