గుట్టలుగా పేరుకుపోయిన కొబ్బరికాయలు
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): కొబ్బరి వర్తకులు ఈ పర్మిట్ తో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని జీఓ జారీ చేయడంతో జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి వర్తకం పూర్తిగా స్తంభించిపోయింది. రోజు వారీ జరిగే సుమారు రూ.3 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగా 30 వేల కుటుంబాలకు ఉపాధి కరువయ్యింది. ఎగుమతి, దిగుమతి, ఒలుపు, దింపు కార్మికులు రోడ్డున పడ్డారు.
ఈ పర్మిట్ అంటే..
ప్రతి వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ప్రతి 15 రోజులకో, లేదా నెలాఖరుకో వ్యాపార లావాదేవీలను బట్టి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పన్ను చెల్లించేవారు. అయితే గత నెల జూన్ 1 నుంచి ఈ పర్మిట్ ద్వారా పన్ను చెల్లించాలని జీఓ జారీ చేశారు. దీంతో వర్తకులు ఆందోళనకు దిగడంతో కొంత వెసులుబాటు కల్పించారు. అయితే అదే జీఓను ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించుకోవడంతో కొబ్బరి వర్తకులు జూలై 1 నుంచి వ్యాపార లావాదేవీలు నిలిపి వేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
ఈ పర్మిట్ విధానం ప్రకారం వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ఏ రోజు పన్నును ఆ రోజే ఈ పర్మిట్ విధానంలో చెల్లించాలి. ఇది వర్తకులకు సాధ్యం కాదంటున్నారు. గుమస్తాలకు ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించడం వీలు కాదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి కాయలను ఎగుమతి చేసుకునే సరికి అర్థరాత్రి అవుతుంది. ఆ సమయంలో నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సిగ్నల్స్ కూడా సరిగా పని చేయవంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పన్నులు ఏవిధంగా చెల్లిస్తామని కొబ్బరి వర్తకులు ప్రశ్నిస్తున్నారు.
ధర పడిపోతుందని ఆందోళన
కొబ్బరి వర్తకులు సమ్మె కారణంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి నిలిచిపోవడంతో కేరళ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయి. దీంతో సమ్మె విరమించినా కొబ్బరి ధర పడిపోతుందని రైతులు, వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
40 కోట్ల కొబ్బరి కాయలు ఎగుమతి
ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రతి రోజు సుమారు 40 కోట్ల కొబ్బరి కాయలు మహారాష్ట్ర, ముంబై, పుణే, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీని ద్వారా రోజువారీ రూ.3 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 200 మంది కొబ్బరి వర్తకులున్నారు. రోజుకు 100 లారీల కొబ్బరి కాయలు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. లారీకి మూడు నుంచి 5 లక్షలు కొబ్బరి కాయలు ఎగుమతి చేస్తే సుమారు 40 కోట్లు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఉపాధి కరువైన ఒలుపు, దింపు కార్మికులు
కొబ్బరి వర్తకం ప్రధానంగా ఒలుపు, దింపు, హమాలీలు (ఎగుమతి కూలీలు), గుమస్తాలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 30వేల మంది కుటుంబాలకు ఉపాధి కరువైంది. దీంతో గత వారం రోజుల నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఏ రోజు కారోజు పని చేసుకుని ఉపాధి పొందే కూలీలకు పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది.
ఉపాధి లేక ఇబ్బందులు
ప్రభుత్వం వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలి. ఈ పర్మిట్ వల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు కష్టం. అంతే కాకుండా గుమస్తాలకు అవగాహన తక్కువ. దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక షాపులో గుమస్తాగా పనిచేస్తున్నా. కొబ్బరి కాయ నాణ్యతను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తాం.
– కాపిశెట్టి కృష్ణ, గుమస్తా
గుదిబండగా మారింది
ఒలుపు, దింపు కార్మికులకు ఉపాధి కరువైంది. ఏ రోజు కారోజు పనిచేసుకుని ఉపాధి పొందే ఒలుపు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ గుదిబండగా మారింది. కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఆ జీఓను వెనక్కి తీసుకోవాలి.
– దూలం భాస్కరరావు, ఒలుపు కార్మికుడు
Comments
Please login to add a commentAdd a comment