
చలి.. గాలి.. వాన..!
జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏజెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి.. గాలి.. వాన కలగలిపి ఇబ్బంది పెడుతోంది. దాదాపు మూడు వారాల క్రితం నుంచి చలి విజృంభిస్తోంది. రోజు రోజుకూ అది ఉధృతరూపం దాలుస్తూ వణికిస్తూ వస్తోంది. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతూ జనాన్ని అవస్థల పాల్జేస్తున్నాయి.
* ఒక్కసారిగా మారిన వాతావరణం
* అల్పపీడనమే కారణం
* నేడు, రేపూ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం : జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏజెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై అసలు సూర్యుడు కనిపించనే లేదు. నైరుతి బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతోంది. అది మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం విశాఖపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి చలికి గాలి కూడా తోడైంది.
మధ్యాహ్నం వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ఇలా రోజంతా ఇదే వాతావరణం కొనసాగింది. రానున్న రెండ్రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు ఆకాశంలో మేఘాలు ఆవరించి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఫలితంగా చలిని నియంత్రిస్తాయి. కానీ ప్రస్తుతం పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి.
దీనివల్ల పగటి పూట కూడా చల్లదనం పరచుకుంటోంది. పగలూ, రాత్రి చలి ప్రభావం కనిపించడానికి ఇదే కారణమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో ఇప్పటిదాకా రాత్రి పూటే చలిని చవిచూసిన జిల్లా వాసులు ఇప్పుడు పగలూ శీతలంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. దీనికి ఈశాన్య గాలులు కూడా తోడవడం వల్ల జనం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వాతావరణానికి పలువురు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో స్వెటర్లు, జర్కీన్లు, మంకీ క్యాప్‌లతో బయటకు వస్తున్నారు. మరోవైపు మంగళవారం, బుధవారం జిల్లాలో మోస్తరు వర్షం గాని, అప్పుడప్పుడు భారీ వర్షం గాని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడనున్నందున ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. ఇవి ఈశాన్యం దిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో మంగళవారం నుంచి ఇవి ఇంకా అధికం కానున్నాయి.