నేటి నుంచి అంగన్‌వాడీ వర్కర్ల సమ్మె
చిత్తూరు (సెంట్రల్) : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో తాము ఆందోళన బాట పట్టాల్సివచ్చిందన్నారు. కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్ కల్పించాలని, వర్కర్‌కు లక్ష రూపాయలు, హెల్పర్‌కు 50వేల రూపాయలకు తగ్గకుండా గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగాను, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఐసీడీఎస్‌లో స్వచ్ఛంద, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల జోక్యం ఉండరాదని, ప్రభుత్వమే అంగన్‌వాడీ కేంద్రాలను నడపాలన డిమాండ్ చేశారు. మినీఅంగన్‌వాడీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను బీఎల్‌వో డ్యూటీల నుంచి మినహాయించాలన్నారు.
అన్న అమృతహస్తం పథకంలో ఈవోల జోక్యం తొలగించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు, కట్టెల బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, వేసవి సెలవులను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజిని అధ్యక్షత వహించగా, సీఐటీయూ చిత్తూరు డివిజన్ కార్యదర్శి గణపతి, నాయకులు సురేంద్రన్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు శైలజ తదితరులు కలెక్టరేట్‌లోని కార్యాలయ పరిపాలనాధికారి ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.
నేటి నుంచి సమ్మెలోకి...
రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజిని తెలిపారు.
కలెక్టరేట్ ముట్టడి
Published Sat, Mar 14 2015 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement