సమీక్షలు, హెచ్చరికలతో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ ‘ప్రజా విజ్ఞప్తుల దినం’ నిర్వహణపై దృష్టి సారించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమీక్షలు, హెచ్చరికలతో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ ‘ప్రజా విజ్ఞప్తుల దినం’ నిర్వహణపై దృష్టి సారించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా నిర్వహణ తీరులో పలు మార్పులు సూచించారు. వ్యయ, ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు అసౌకర్యం కలగకుండా వేగవంతంగా అర్జీలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్, అధికారులు పాల్గొనే ‘ప్రజా విజ్ఞప్తుల దినం’లో సమస్యలు విన్నవించేందుకు సామాన్యులు వస్తూ ఉంటారు.
అర్జీదారుల వివరాలు నమోదు చేసేందుకు ఓ ప్రత్యేక సెల్ ఉన్నా గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారాల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు కూడా ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించే దిశలో కలెక్టర్ ‘ప్రజా విజ్ఞప్తుల దినం’ నిర్వహణలో పలు మార్పుల దిశగా సూచనలు చేశారు. సమావేశ మందిరంలోని రెండు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. ‘పరిష్కారం, ప్రజావాణి సెల్’కు అందిన విజ్ఞాపనలు ఏ దశలో ఉన్నదీ తెలిపేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో అర్జీదారుల వ్యయ, ప్రయాసాలు కొంతమేర తగ్గే అవకా శం ఉంది. అర్జీదారుల వివరాలు నమోదు చే సేందుకు కౌంటర్లను నాలుగుకు పెంచనున్నా రు. విభాగాల వారీ గా కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలను కంప్యూటరీకరిస్తారు. సచివాలయం తరహాలో కలెక్టరేట్ సముదాయంలో ‘మీసేవ’ దరఖాస్తుల పురోగతిని తెలిపేలా ‘డిజిటల్ బోర్డు’ ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో ‘కీలక’ బదిలీలు?
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్మితా సబర్వాల్ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాన శాఖల సమీక్షలు ముగిసిన తర్వాత క్షేత్ర స్థాయి అధికారుల బదిలీపై కలెక్టర్ దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్‌ఐలు, డీటీలు, తహశీల్దార్ల బదిలీపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. వారి పనితీరును బేరీజు వేసిన తర్వాత బదిలీలు ఉంటాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.