
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘చంపావతి’ విషయంలో ఏదో తప్పు జరుగున్నట్టు అనిపిస్తోందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ సమీపంలో విజయనగరం–నాతవలస ఆర్‌అండ్‌బీ రహదారిని ఆనుకుని చంపావతి నది కి అడ్డంగా రహదారి నిర్మించి ఇసుక తరలిస్తున్న వైనంపై ‘చంపావతి గుండె కోత’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ‘సాక్షి ప్రతినిధి’తో శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ‘చంపావతిలో రహదారి నిర్మాణం విషయం మా దృష్టికి వచ్చింది.
ఇంతకు ముందు అనుమతిలేకుండా మొదలుపెట్టారు. తర్వాత ఇరిగేషన్ నుంచి అనుమతి తీసుకుని ప్రారంభించారు. దానిపైనా విమర్శలు వస్తున్నాయి. ఏదో తప్పు జరుగుతోందని మాక్కూడా అనిపిస్తోంది. త్వరలోనే చర్యలు తీసుకుంటాం.’అని కలెక్టర్ స్పష్టం చేశారు.