కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల పశువైద్య కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాశాలలో 2008-09లో వెటర్నరీ వైద్య కోర్సులో చేరి నెల రోజుల క్రితం ఫైనల్ పరీక్షలు రాసిన 40 మంది విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. వీరికే కాదు.. 2012-13లో కోర్సు నాలుగో సంవత్సరం పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మరో 40 మంది విద్యార్థులకు వీసీఐ అనుమతిపై ఆందోళన వీడడం లేదు.
ప్రచార ఆర్భాటమే!
ఐదేళ్ల క్రితం పశువైద్య కళాశాలను ఆర్భాటం గా ఏర్పాటు చేసిన నేత లు వసతుల కల్పన, నిధుల మంజూరుపై మాత్రం శ్రద్ధ చూపలే దు. మూడేళ్లపాటు కళాశాల అభివృద్ధికి ఒక్క రూపాయి మంజూరు కాలేదు. అద్దె భవనంలోనే ప్రారంభమైన కళాశాలకు అవసరమైనంత మంది బోధకులు, ప్రాక్టికల్స్ కోసం పశువుల ఫాంలు, ఇతరత్రా సౌకర్యాలు లేక విద్యార్థులు కేవలం థియరీకే పరిమితమయ్యారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు ఐదో సంవత్సరం చేరే వరకు వసతు లు కల్పన ఊసేలేకుండా పోయింది. కళాశాలలో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ లేకుండా కోర్సులు పూర్తి చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తూ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో దీక్షలు చేపట్టారు. స్పందించిన వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు కోరుట్లలో చివరి సంవత్సరం చదువుతున్న మొదటి బ్యాచ్ విద్యార్థులు 40 మందిని రాజేంద్రనగర్, గన్నవరం, తిరుపతి కళాశాలల్లో చదివేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో కోరుట్ల నుంచి కళాశాల తరలిపోతుందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో నిద్రమత్తు వదిలించుకున్న నేతలు కళాశాలలో సౌకర్యాల కోసం ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కళాశాలకు మొదటిసారిగా పెద్ద మొత్తంలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అనంతరం పలు దఫాల్లో రూ.70 కోట్లు నిధులు రాగా, నెల క్రితం కళాశాల హాస్టల్ భవనాలు, ఫాంల నిర్మాణం పూర్తయింది. ఈ సంబరంలో కళాశాల అనుమతి విషయాన్ని నేతలు మరిచిపోయారు.
పనికిరాని పశువైద్య పట్టాలు
కోరుట్ల కళాశాల మొదటి బ్యాచ్(2008-09) విద్యార్థులు 40 మంది నెలరోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు రాశారు. త్వరలో వీరికి పశువైద్య పట్టాలు చేతికందనున్నాయి. ఈ పట్టాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదముంది.
ఈ పట్టాలతో ఏవైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని దుస్థితి. 15 రోజుల క్రితం పశువైద్య కళాశాల హాస్టల్ భవనాలు, పశువుల ఫాం ప్రారంభించడానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కళాశాలకు వచ్చారు. కళాశాల గుర్తింపు విషయమై వీరిని విద్యార్థులు నిలదీశారు. వెంటనే గుర్తింపు వచ్చే చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు సర్దిచెప్పి కార్యక్రమం అయిందనిపించుకున్న నాయకులు... అనుమతి విషయమే మరిచిపోయారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కోరుట్ల పశువైద్య కళాశాలకు వెంటనే వీసీఐ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
గుర్తింపునకు కృషి : విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే
కోరుట్ల పశువైద్యశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇప్పించాలని ఇదివరకు ఓ సారి ముఖ్యమంత్రికి వినతి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం కళాశాలకు అన్ని వసతులు కల్పించాం. ఇప్పుడు వీసీఐ గుర్తింపు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. నా పరిధిలో కళాశాల గుర్తింపు కోసం శాయశక్తులా కృషి చేస్తా. విద్యార్థులు ఆందోళన చెందవద్దు.
నేతలు.. ఫెయిల్!
Published Thu, Oct 17 2013 4:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement