
హాస్యం ట్రాక్ మారింది
సినీ నటుడు గిరిబాబు
పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం) : పాత సినిమాలలో హాస్యం కథలో భాగంగా ఉండేదని.. ప్రసుత్తం చిత్రాల్లో కామెడీ ఓ ట్రాక్‌లా మారిందని సినీ నటుడు గిరిబాబు అన్నారు. శనివారం పెదతాడేపల్లిలో వర్మ వెర్సస్ శర్మ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన లోటస్ స్కూల్‌లో విలేకరులతో ముచ్చటించారు.
ఇప్పుడు హాస్యం ఎలా ఉంది.
హాస్యం బాగానే ఉంది. మంచి కమేడియన్స్ చిత్రసీమలో ఉన్నారు. ఎవరి ట్రాక్ వారిది. ఇమిటేషన్ లేదు కాని హాస్యం కథలో అంతర్భాగంగా ఉండటం లేదు. మరో ట్రాక్‌గా హాస్యం ఉంటోంది.
ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం
ఇటీవల వస్తున్న చాలా చిత్రాల్లో పాటలేంటో తెలియడం లేదు. గందరగోళంగా ఉండే మ్యూజిక్‌ను చూసి గాబరా పుడుతోంది. ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియూలో వస్తున్న పాటల పోటీల్లో ఆపాత మధురాలను పిల్లలు శ్రావ్యంగా ఆలపించడం కాస్త ఊరటనిస్తోంది.
మీ డ్రీమ్ రోల్స్
42 ఏళ్లగా జానపదాలు, పౌరాణికాలు, హీరో, కామెడీ, విలన్, సహాయ నటుడు వంటి భిన్న పాత్రలు పోషించాను. రాముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రలు చేయాలనే కోరిక ఉన్నా, బాడీ లాంగ్వేజ్ సరిపోక ఆ కోరిక తీరలేదు.
పాత తరం హాస్యనటుల గురించి
రేలంగి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి వంటి మేటి హాస్యనటుల హాస్యం అజరామరం. రాయలసీమ యాసను కూడా రమణారెడ్డి పౌరాణికాలలో మాట్లాడి రక్తికట్టించారు. గతంలో తెలంగాణ యాసతో హాస్యం పండేది. రాష్ట్రాలు విడిపోయాక అక్కడ తెలుగు యాసతో హాస్యాన్ని పండిస్తారేమో చూడాలి. గోదావరి జిల్లాలలో మాట్లాడే భాష చిత్ర సీమలో ఉంటుంది.
నటునిగా సంతృప్తి చెందారా
నటునిగా సంతృప్తి చెందడంతో పాటు దేవతలారా దీవించండి, మెరుపుదాడి వంటి మంచి చిత్రాలు నిర్మించా. మెరుపుదాడితో హిట్ కొట్టా. యాంటీ సెంటిమెంటుతో సంధ్యారా గం సినిమా తీశా కథ బాగున్నా విజయం సాధించలేదు.
తాడేపల్లిగూడెం ఎలా ఉంది
జిల్లాలో పాలకొల్లు, భీమవరం, నరసాపురం. తణుకు, పాలకొల్లు వంటి ప్రాంతాలకు గతంలో వచ్చాను. ప్రముఖ హాస్య నటుడు రేలంగి వారి గూడెం రావడం ఆనందంగా ఉంది. ఆయన థియేటర్ చూశాను.
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు
రాజశేఖర్‌తో గడ్డం గ్యాంగ్ చేశాను. బాలకృష్ణ లయన్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సిని మాలు, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో నటిస్తున్నా.