సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు వంటి ఫర్నిచర్ కొనుగోలులో కూడా కమీషన్లు మింగేస్తున్నారు. విద్యార్థుల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు దాదాపు రూ.20 కోట్లతో బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు సరఫరా చేసిన బెంచీలు, కుర్చీలు, టేబుళ్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండడంతో అవి నాలుగు రోజులకే మూలకు చేరాయి.
ఈ ఫర్నిచర్ కొనుగోలుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) రూ.10 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) రూ.10 కోట్లు భరించాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ఏ ఇప్పటికే సగానికి పైగా నిధులు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు విడుదల చేయలేదు. నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. పాత ఫర్నిచర్ స్థానంలో నాణ్యమైన ఫర్నీచర్‌ను సర ఫరా చేయాలని ఎస్‌ఎస్‌ఏ పేర్కొంది. అప్పటివరకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఈలోగా ఉన్నతాధికారులు ఆర్‌ఎం ఎస్‌ఏ నుంచి రూ.10 కోట్ల నిధులను విడుదల చేయించారు.
మరో రూ.20 కోట్లకు ఎసరు!
గతంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నిచర్ వృథాగా పడి ఉండగా, మళ్లీ 630 హైస్కూళ్లకు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20.88 కోట్లతో ఈ ఫర్నీచర్ కొనాలని నిర్ణయించారు. ఎస్‌ఎస్ ఇంజనీర్స్, సాయి డేటా క్రియేషన్, లక్ష్మీ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్, శ్రీ సిద్ధివినాయక ఇండస్ట్రీస్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ సంస్థల ద్వారా ఈ ఫర్నిచర్ కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు.
డెమో టేబుళ్లు, స్లాటెడ్ యాంగిల్ రాక్స్, స్టీల్ టూల్స్, టీచర్లకు ఛైర్‌లు, టేబుళ్లు, డ్యూయెల్ డెస్కులు, అల్మరాలు, కంప్యూటర్ టేబుళ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,800 కోట్లతో పూర్తిస్థాయిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, కంప్యూటర్లు, తరగతి గదులు, మంచినీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అయినా మళ్లీ కొత్తగా రూ.20.88 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు వెనుక లోగుట్టు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment