► సామాన్య జీవితం, దాతృత్వంలో మేటి హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్
► టీటీడీ ట్రస్టులకు రూ.30 కోట్లకు పైగా విరాళాలు
► కానీ ప్రత్యేక దర్శనాల్లో వెళ్లేది అరుదు
సాక్షి, తిరుమల: హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ్‌నాడార్ 2015లో వెల్లడైన భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఈయన ఏడాదిలో రెండు మూడుసార్లు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఈయనకు ప్రత్యేక దర్శనం కల్పించే అవకాశం ఉంది. అయినప్పటికీ సాధారణ భక్తుడిలాగే వస్తుంటారు. అందరితో కలసి రూ.300 టికెట్ల క్యూలోనే ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.
తర్వాత హంగూ ఆర్భాటాలకు తావులేకుండా తిరిగి వెళుతుంటారు. మంగళవారం కూడా సామాన్య భక్తుడిలాగే రూ.300 టికెట్ల క్యూలో ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రూ.కోటి విరాళం అందజేసి, ఈ మొత్తాన్ని నిత్యాన్న ప్రసాదానికి వాడాలని విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ట్రస్టులకు రూ.30 కోట్లకు పైగా విరాళం
టీటీడీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు విద్య, వైద్య సేవలతో పేదలకు ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ మహాయజ్ఞానికి హెచ్‌సీఎల్ కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇప్పటికే హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యపరంగా ఎన్నో సేవలందిస్తున్న శివ్‌నాడార్ టీటీడీ పథకాలకు భూరి విరాళాలు సమర్పించారు. ఇప్పటికే టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు రూ.30 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్టు స్వయంగా టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ రూ.కోటికి తగ్గకుండా విరాళం ఇవ్వడం శివ్‌నాడార్ సంప్రదాయం.
సామాన్య భక్తుడిగానే వెంకన్న దర్శనం
శ్రీవారి దర్శనం కోసం రోజూ లక్ష మందిదాకా వచ్చే తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, మర్యాదల కోసం హోదాలేని వ్యక్తులు చేయని సిఫారసులుం డవు. కానీ శివ్‌నాడార్ సామాన్యుడిగానే క్యూలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఆయన ప్రత్యేకత.
కుబేరుడూ.. సామాన్యుడే!
Published Wed, Mar 30 2016 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement
Advertisement