జహీరాబాద్, న్యూస్‌లైన్ : ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారం దొంగతనానికి గురైనందున ఎలాంటి తరుగు తీయకుండా 24 క్యారెట్ల లెక్కన బంగారం అందజేయాలని తాకట్టు దారులు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం విషయమై తాకట్టు దారులు అధికారులను నిలదీశారు. ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్‌లో ప్రజలు అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టిన బంగారం దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. దొంగతనానికి గురైన బంగారు ఆభరణాల్లో కొంత నిందితుడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారు ఆభరణాలు లభించాల్సి ఉంది.
అయితే గురువారం ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన వారు దొంగతనం జరిగిన వాటిని సంబంధించి ఆభరణాలకు 24 క్యారెట్ల లెక్కన తరుగు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే తమ ఫైనాన్స్ నిబంధనల మేరకు 22 గ్రాస్ క్యారెట్ల కింద లెక్కకట్టి, మేకింగ్ చార్జీలను కూడా కలిపి అందించడం జరుగుతుందని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు వారు నిరాకరించారు. 24 క్యారెట్ల లెక్కన అందించాలని పట్టుబట్టారు. దీంతో గురువారం మధ్యాహ్నం ముత్తూట్ ఫైనాన్స్ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ లక్ష్మణ్‌రావు జహీరాబాద్ వచ్చి తాకట్టు దారులతో సమావేశమయ్యారు.
ఫైనాన్స్ నిబంధనల మేరకే తాము నడుచుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తాకట్టుదారుల డిమాండ్లను హెడ్ ఆఫీస్‌కు నివేదిస్తామని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందు కోసం వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు తాకట్టు దారులు సమ్మతించి వెళ్లిపోయారు. నిందితుడి వద్ద నుంచి లభించిన బంగారు ఆభరణాలు సదరు తాకట్టు దారులకు త్వరలో అందించడం జరుగుతుందని ఆర్‌ఎం లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. మిగతా ఆభరణాలకు సంబంధించి బంగారం రూపంలో అందిస్తామన్నారు. రీజినల్ మేనేజర్‌తో తాకట్టు దారులు జరిపిన చర్చల్లో సీఐ నరేందర్, ఎస్‌ఐ శివలింగంలు పాల్గొన్నారు.
‘ముత్తూట్’ వద్ద పసిడి తాకట్టుదారుల ఆందోళన
Published Fri, Mar 7 2014 12:04 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM
Advertisement
Advertisement