టీడీపీపై కాపుల్లో కోపం! | Conflicts in Krishna TDP Party | Sakshi
Sakshi News home page

టీడీపీపై కాపుల్లో కోపం!

Published Sat, Jan 19 2019 1:55 PM | Last Updated on Sat, Jan 19 2019 1:55 PM

Conflicts in Krishna TDP Party - Sakshi

బందరు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో అధికార పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందా? ఇక తాము పార్టీలో ఇమడలేమని నిర్ణయించుకున్నారా? త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.. మచిలీపట్నం కాపు నేతల నుంచి. నాలుగేళ్ల పాలనలో తమకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని.. ఏ ప్రధాన పదవీ తమకు ఇవ్వలేదని.. టీడీపీపై వారంతా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

సాక్షి,కృష్ణాజిల్లా,  మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమకు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారో అక్కడికి వెళ్లేందుకు నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బందరు కాపు సామాజిక వర్గ నేతల నుంచి టీడీపీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా తమను పట్టించుకున్న దాఖలాలు లేవన్న భావన వ్యక్తమవుతోంది. బందరు నియోజకవర్గ వ్యాప్తంగా 1.60 లక్షల మంది ఓటర్లుండగా.. అందులో దాదాపు 50,000లకు పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ముస్లిం, గౌడ, కమ్మ, యాదవుల ఓట్లున్నాయి. బందరు పట్టణంలో సైతం వారి హవా ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో వీళ్లే ప్రధాన భూమిక పోషించే అవకాశం సైతం లేకపోలేదు.

అన్నింటా మొండిచేయి..
అంతటి ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టీడీపీ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రధాన పదవుల్లో సైతం మొండిచేయి ఎదురవుతోంది. కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్‌ కోసం మాత్రమే వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పట్టణంలో కౌన్సిలర్, వార్డు మెంబర్ల స్థాయి పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలు కాపు సామాజిక వర్గంలో అసహనానికి కారణమవుతున్నాయి.

కాపు భవన్‌ నిర్మాణం ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఎప్పటికి మొదలవుతుందోనన్న మీమాంస నెలకొంది. భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఓ వ్యక్తి 50 సెంట్ల స్థలాన్ని సైతం ఉచితంగా ఇచ్చారు. అయినా పనులు ప్రారంభించేందుకు స్థానిక పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదు.
జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల మేర కాపు రుణాలు అందించారు. ఒక్క బందరు నియోజకవర్గంలో మాత్రం కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. దీనిపై సైతం గుర్రుగా ఉన్నారు.
కోనేరు సెంటర్‌లో బ్రిటీష్‌ పాలకులను జెండాను తొలగించి భారత జెండా ఆవిష్కరించడంతో కీలకంగా వ్యవహరించిన  తోట నరసింహనాయుడుని సైతం విస్మరించారన్న విమర్శలున్నాయి.
టీడీపీ రాష్ట్రస్థాయి పదవి మంత్రి కొల్లు రవీంద్ర వర్గమైన గోపీచంద్‌కు కట్టబెట్టడంపై సైతం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
ఇండియా క్రికెట్‌ జట్టు తొలి కెప్టెన్‌ సీకే నాయుడు విగ్రహ ఏర్పాటు కాపుల్లో మరింత అగ్గిని రాజేసింది. పైకి చెప్పకపోయినా లోలోపల ఆగ్రహంతో ఉన్నారు. అంతటి ఘన కీర్తిని చాటిన వ్యక్తి విగ్రహం జెడ్పీ కేంద్రంలోని మురుగు కాలువకు పక్కన ఏర్పాటు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

ఆర్‌అండ్‌బీలో రహస్య సమావేశం?
తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో తామెందుకు ఉండాలన్న యోచనలో కాపులు ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పట్టణంలోని 20 మందికి పైగా కాపు నాయకులు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో మూకుమ్మడిగా పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని తీర్మానించినట్లు వినికిడి. త్వరలో మరోసారి సమావేశమై చర్చించిన అనంతరం తమ డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని, తమకు సానుకూల పవనాలు వీయని పక్షంలో గుడ్‌బై చెప్పాలని తీర్మానించినట్లు విశ్వసనీయవర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం.  

మంత్రి వద్దకు పంచాయితీ?
కాపులు సమావేశమైన విషయం కాస్తా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి వెళ్లింది. అయినా తనకేమీ తెలియనట్లు వ్యవహరించినట్లు తెలిసింది. పైకి అలా ఉన్నా.. లోలోపల మాత్రం సమావేశానికి ఆద్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? వాళ్లకు కేసులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ మొదలు పెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement