
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు గడ్డుకాలం
పార్టీలో ఉండలా వద్దా ఆలోచిస్తున్నా: డొక్కా
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా?, టీడీపీలో చేరాలా? వద్దా? అనే అంశాలపై తాను సందిగ్ధంలో ఉన్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం తన అనుచరులతో మాట్లాడి తుదినిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ తీవ్ర గడ్డుపరిస్థితిలో ఉందని, అది కోలుకోవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ సీఎల్పీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. తనకు అన్నివిధాలా అండదండలందిస్తూ సోదరుడిలా నిలచిన రాయపాటిని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పొరపాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి టీడీపీలో చేరాలన్న అభిప్రాయానికి వచ్చారన్నారు. తనమీదున్న అభిమానంతో ఆయనతోపాటు తానూ వస్తానని చెప్పానని, అయితే ఈ విషయంలో తానింకా ఏమీ తేల్చుకోలేకపోతున్నానని డొక్కా వివరించారు