
జగన్‌పై సీబీఐ దర్యాప్తు చేయించింది కాంగ్రెస్సే
పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ వెల్లడి
హైకోర్టులో పిటిషన్ వేసిందే మావాళ్లు
బాబుపైనా జరిపించి ఉండాల్సిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఆలస్యంగానైనా నిజం నిగ్గుదేలింది. వైఎస్ జగన్‌పై జరిగింది రాజకీయ కుట్రేనని నిరూపితమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం నుంచీ చెబుతూ వస్తున్న ఈ విషయాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తాజాగా ధ్రువీకరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు చేయించింది తామే (కాంగ్రెస్)నని ఆయన అంగీకరించారు.
‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటికీ, ఆయనపై ఆరోపణలు వచ్చినందున కచ్చితమైన దర్యాప్తు చేయించాం. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాంటిది అయనపై సీబీఐ విచారణ చేయించకపోవడం సమర్థనీయం కాదు’ అని అన్నారు. డీఎస్ గురువారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీపై చంద్రబాబు అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. సిద్ధాంతాలు, నైతిక విలువలు లేని బాబు... దేశం కోసం, కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేసిన సోనియాపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. అధికారం కోసం బాబు ఎంతకైనా దిగజారతారంటూ విమర్శించారు. ‘‘ఎమ్మెల్యేలందరినీ ప్రలోభపెట్టి బాబు అప్రజాస్వామికంగా అధికారం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా వాజ్‌పేయి హవా వల్ల బాబు రెండోసారి సీఎం అయ్యాడు. లౌకికవాదినని చెప్పుకునే బాబు ఇప్పుడు మతతత్వ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నాడు’’ అని ధ్వజమెత్తారు. బాబుపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రుజువు చేయలేకపోయిందని విలేకరులు ప్రశ్నించగా, ‘‘నాడు కేంద్రంలో మేం (కాంగ్రెస్) అధికారంలో లేము. బాబుకు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఆయనపై విచారణ జరపలేదు. వైఎస్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాం. చంద్రబాబుపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే కక్షసాధింపు అంటారని ఆగిపోయాం’’ అని బదులిచ్చారు. సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు కదా, మీ ప్రభుత్వం అంటారేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘హైకోర్టు ఎందుకు ఆదేశించిం ది? ఏమైనా కలగన్నదా? పిటిషన్ వేసిందెవరు? మా వాళ్లే కదా! అదే సమయంలో కమిట్‌మెంట్‌తో విచారణ జరిపించింది ఎవరు? మా ప్రభుత్వమే కదా!’’ అంటూ బదులిచ్చారు.
కిరణ్ ఏమీ చేయలేడు: మంత్రి శ్రీధర్‌బాబు సమర్థుడైనందునే వాణిజ్య పన్నుల శాఖను అదనంగా కేటాయించామన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలపై డీఎస్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘వాణిజ్య శాఖను సమర్థంగా నిర్వహింగల వ్యక్తి శాసనసభ వ్యవహారాల శాఖను నిర్వహించలేని అసమర్థుడా? నిజంగా సమర్థుడే అనుకుంటే శ్రీధర్‌బాబును ఆ శాఖలో కూడా కొనసాగించవచ్చు కదా! అలాకాకుండా కరడుగట్టిన సమైక్యవాది అయిన శైలజానాథ్‌కు అప్పగించడం వెనుక ఉద్దేశమేమిటి?’’ అంటూ ప్రశ్నించారు. ‘కిరణ్ ఏదో సాధించాలని అనుకుంటున్నాడు. కానీ ఏమీ చేయలేడనే సంగతిని గుర్తుంచుకోవాలి’’ అని పేర్కొన్నారు.