జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి భస్మాసుర హస్తాన్ని తలపిస్తోంది. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం బరితెగించితే... జిల్లా నాయకులు నోరెత్తకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉండడం, ఇంకా పదవులను పట్టుకువేలాడడంతో ఆ పార్టీ నేతలు జనం మధ్యకు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. ప్రజాగ్రహ జ్వాలకు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యవాదులనుంచి ఎదురైన పరాభవం జిల్లాలోని కాంగ్రెస్ నేతల ను ఆలోచనలో పడేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చక్రం తిప్పుతున్న స్థానిక నేతలు జిల్లాలో తిరిగితే ఇటువంటి చేదు అనుభవాన్నే ఎదుర్కోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కేంద్రమంత్రి కావూరికి బుధవారం సమైక్యసెగ తగిలింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కావూరి.. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపార్టీలు తెలంగాణ అంశంపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తొలుత సమర్థించి ఆ తర్వాత మాట మార్చారు. ఆయన ధోరణిని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. జిల్లా పర్యట నకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకొని, నిరసన తెలపడంతో కావూరి అవమాన భారంతో వెనుదిరిగారు. కేంద్రమంత్రికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. తమ సంగతి ఏమిటని కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు.
ప్రజల మధ్యకు రాని ఎంపీ
పరిస్థితులను ముందుగానే పసిగట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ జనం మధ్యకు రావడమే మానేశారు. అడపాదడపా వచ్చినా మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరిగా జనంలో ఉండలేకపోతున్నారు. ఏదో విధంగా ప్రచారం కోరుకునే లగడపాటి ఈసారి మౌనంగా ఉండిపోయారు. ఏ వైఖరి తీసుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే ఆయన కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ప్రకటనలు గుప్పించిన లగడపాటి వాయిస్‌లో బేస్ తగ్గిందని ప్రజలు దుయ్యబడుతున్నారు.
మంత్రి సారథిదీ అదే దారి
రాష్ర్ట మంత్రి సారథి సైతం జనంలోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ను, మంత్రి పదవిని పట్టుకుని వేలాడుతున్న సారథి.. జిల్లాలో సమైక్యవాదులకు తన ముఖం చూపలేకపోతున్నారు. హైదరాబాద్, ఢిల్లీల్లో సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యమానికి ఆయన చేరువకాలేకపోతున్నారు. జిల్లాకు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్న మంత్రి తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన మంత్రి పదవికైనా రాజీనామా సమర్పిస్తే ఆయనపై కొంత గౌరవం ఉంటుందని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కార్యాలయాల మొహం చూడని ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విష్ణు, దాసు, వెలంపల్లి , రవి, పద్మజ్యోతి, ఇతర ముఖ్యనేతలు సమైక్య ఉద్యమం దరిదాపులకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మీడియా పులిగా పేరున్న మల్లాది సమైక్య ఉద్యమంలో పాల్గొనకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గంలోకే కాదు, కనీసం వారి కార్యాలయాల్లోకి అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ప్రజాభీష్టం కంటే పదవులే పరమావధిగా భావించే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని, పదవులను పట్టుకువేలాడుతున్న వారిని నిలదీసేందుకు ప్రజలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అడుగుపెడితే నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు.
భస్మాసుర హస్తం
Published Thu, Sep 19 2013 2:38 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement
Advertisement