'బాబుకు ఓటమి భయంతోనే'
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం లేకే సీఎం చంద్రబాబు ఎన్నికలు నిర్వహించడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లకు, మరో 5 పుర పాలక సంఘాలు, ఏడు జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ, 129 సర్పంచ్ స్థానాలకు, 36 మున్సిపల్ వార్డులు, 1109 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని చట్టంలో ఉన్నా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సాహసించకపోవడానికి ఓటమి భయమే కారణమని తులసిరెడ్డి పేర్కొన్నారు.