మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా..జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
సాక్షి, ఒంగోలు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా..జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించుకోవడంపై ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు కిరణ్‌పై బహిరంగంగానే విమర్శలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటిదాకా కిరణ్‌కు అనుకూలంగా మెలిగిన నేతలు ప్లేటు ఫిరాయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి దాకా మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలెవరూ ఁకిరణ్* బాటలో నడిచేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది.
నమ్మించి వంచించిన ‘నల్లారి’
రాష్ట్రవిభజన అంశాన్ని క్రికెట్ మ్యాచ్‌గా చేసి బంతి, బ్యాట్, కోర్టు అంటూ మాయమాటలతో నమ్మించి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నేతగా కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్నటి వరకు ఆయన కనుసన్నల్లో పనిచేసిన అధికారపార్టీ నేతలు .. నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని సమర్థించే పరిస్థితిలో లేరనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన కొత్తపార్టీ పెడితే జిల్లా నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ఎవరూ సిద్ధపడరనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమౌతోంది. జిల్లాలో కేంద్రమంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మిలు ఆదినుంచి విభజన బిల్లుపై అధిష్టానానికి బద్ధులై పనిచే స్తుండగా, వారు కొత్తపార్టీకి మారే అవకాశమే లేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తొలుత ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ, ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన పక్కపార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన తన అనుచరవర్గాన్ని సమీకరించి ఏపార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తాజామాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి బయటకు రావడం కష్టమేనని చెప్పాలి. ఆయన టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినా.. ఆ రెండు పార్టీలు దాదాపూ తలుపులు మూసేసినట్లేనని సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసే ఆలోచనకు సాహసించరని.. ఈ ఎన్నికల్లో ఎటూ ఓటమి తప్పకున్నా కాంగ్రెస్ నుంచే పోటీచేస్తారని ఆయన అనుచరవర్గం అభిప్రాయపడుతోంది.
సంచలనమైన ‘డొక్కా’ విమర్శన లేఖాస్త్రం
గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా పనిచేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గురువారం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు లేఖ పంపారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా కిరణ్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. ఆమంచి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శిష్యుడైనందున..్ఙకిరణ్* జట్టులో చేరరని స్పష్టమవుతోంది. సంతనూతలపాడు, కొండపి, కనిగిరి ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, జీవీ శేషు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా..? ఉంటారా..? అనేది ప్రశ్నగా మిగిలింది. అలాగని, కిరణ్ కొత్తపార్టీ తీర్థం తీసుకునేందుకు సిద్ధపడరని ఆయా నేతల అనుచరులు చెబుతున్నారు. వీరిలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ఇటీవల టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ‘వ్యవహారం’ బెడిసికొట్టిందనేది ప్రచారం.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురే ష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి.. ఇతర పార్టీల్లో రంగప్రవేశానికి పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లపాటు పగ్గాలు పట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాస్థాయిలో క్రియాశీలక కార్యకర్తలతో నేరుగా మాట్లాడిన పరిస్థితులు లేకపోవడం.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంభందాలు కొనసాగించకపోవడంతోనే తాజాగా ఆయన వెంట నడిచేవారు కరువయ్యారని రాజకీయవర్గాల అభిప్రాయం.