సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది. ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సర్వే పూర్తిచేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ).. తాజాగా శాసనసభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. అందులో భాగంగా జనవరి 3న 42 మంది సభ్యుల ఏఐసీసీ బృం దం రాష్ట్రంలో పర్యటించి నియోజకవర్గాలవారీగా సమగ్ర సర్వే నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌పై అవగాహన కలిగిన పొరుగు రాష్ట్రాల నేతల్నే ఏఐసీసీ బృందం లో సభ్యులుగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మాజీ మంత్రు లు, ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 42 మంది సభ్యులు తమకప్పగించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సాధారణ ప్రజలతోనూ మమేకమై.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపై అభిప్రాయాలు కనుక్కుంటారు.
ఆయా అభ్యర్థుల గెలుపు అవకాశాలపై స్థానిక నేతల నుంచి సమాచారం సేకరిస్తారు. డీసీసీ అధ్యక్షుడు, జిల్లా మంత్రి, సీనియర్ నేతల సలహాలను తీసుకుంటారు. ప్రతి జిల్లాలోనూ డీసీసీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. కసరత్తంతా పూర్తయ్యాక ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులతో జాబితాను రూపొందిస్తారు. తరువాత వారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీకి తుది జాబితాను అందజేస్తారు. రాబోయే ఎన్నికల్లో పార్టీపరంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా రూపొందించే బాధ్యతను రాహుల్.. మిస్త్రీకి అప్పగించారు.
ఏఐసీసీ టీం అందించిన జాబితాల్ని పరిశీలించాక మిస్త్రీ ప్రత్యేక జాబితా రూపొందించి రాహుల్‌కు అందజేస్తారు. అభ్య ర్థుల ఎంపికపై రాహుల్ 4 రకాలుగా నివేదికలు తెప్పిం చుకుంటున్నారు. పీసీసీ రూపొందించిన జాబితా ఇప్పటికే ఆయన వద్ద ఉంది. అది తనవద్ద ఉండగానే ఏఐసీసీ తరపున ప్రత్యేక బృందంతో సర్వే చేయిస్తున్నారు. దీనికి సమాంతరంగా కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి జాబితాను, ప్రైవేటు సంస్థ నుంచి మరో జాబి తానూ తెప్పించుకునే పనిలో పడ్డారు. ఈ 4 రకాల నివేదికల్ని సమగ్రంగా పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
13 జిల్లాల డీసీసీ అధ్యక్షుల మార్పు
మరోవైపు జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల పనితీరు ఎలా ఉందనే దానిపై పీసీసీ చీఫ్ బొత్స ఒక అంచనాకు వచ్చారు. అందులో భాగంగా పలు డీసీసీ అధ్యక్షుల పనితీరు ఏ మాత్రం బాగోలేదనే భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 13 జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. అనంతపురం, కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.