
ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం: రఘువీరా
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో పోటీ చేయొద్దంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవతీర్మానం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.
హుదూద్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని చెప్పారు.
బాధితులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీలు వేయాలని సూచించారు. గ్రామ సభల్లో చదివి వినిపించాలి. జాబితాను ఆన్లైన్ కూడా పెట్టాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయినవారందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.