కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి
Published Sun, Jan 5 2014 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో అనిశ్చితి వల్ల కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీకరించేందకు అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని, దానిని తిప్పికొట్టి మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జెడి. శీలం పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గత ఏడాదిగా రాష్ట్రంలో బాధాకర పరిణామాలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు.
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఉందని, ప్రజల అభిప్రాయాలను తీసుకొని తదుపరి దానిని కేంద్రానికి పంపాలన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకులం కాదని, తెలంగాణ ఇచ్చే తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఉన్న ముసాయిదా బిల్లుపై ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు పత్రికలు, టీవీ చానల్స్ ఉన్నాయని, తాము చెప్పుకునేందుకు ఏమీ లేవన్నారు. కొత్తపార్టీ పెట్టే ఆలోచనల్లో ఎవ్వరూ లేరన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎస్సీసెల్ చైర్మన్ ఈరి రాజశేఖర్, పార్టీ నాయకులు కొరివి వినయ్‌కుమార్, భాష్యం నరసయ్య,పెదకాకాని గుడి పాలకమండలి సభ్యురాలు వై.అమ్మణి, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర నినాదాలు...
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థి నాయకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి జె.డి. శీలంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వినతి ప్రతాన్ని సమర్పించారు. వినతి ప్రతం సమర్పించిన వారిలో మండూరి వెంకటరమణ, జెట్టి ఝాన్సీరాణి, రాయపాటి సాయికష్ణ తదితరులు ఉన్నారు.
సూటిగా ప్రశ్నించిన డాక్టర్ రాయపాటి...
విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల గురించి మంత్రి జె.డి. శీలంను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి సర్వే చేయించి సమర్చించిన నివేదికను ఎందుకు బుట్టదాఖలు చేశారని సామాన్య ప్రజలు అడుగుతున్నారన్నారు. ఈ ప్రశ్నలకు మంత్రి శీలం ఎలాంటి సమాధానం చెప్పకుండానే మిన్నకుండిపోయారు.
Advertisement
Advertisement