అంతా అడ్డగోలు
Published Sun, Feb 9 2014 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధికి గత హామీలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఏదో ఒకటి చేసి ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారు. దానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు పట్టణంలోని ఒక సామాజిక వర్గానికి జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికై, పదవీ కాలం పూర్తి కావస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు ఆ హామీ గుర్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు,
సంబంధిత సామాజికవర్గ నాయకులు కలిసి, పట్టణంలోని ముచ్చిమిల్లి వద్ద గల కవలవారిసావరంలో ఒక రైతు వద్ద 83 సెంట్ల భూమి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఆ స్థలంలో 80 కుటుంబాలకు జి+1 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఎంపిక చేయాలని, లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని తహశీల్దార్‌ను జిల్లా హౌసింగ్ అధికారులు ఆదేశించారు. ఈ తంతంగం జరుగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 9న ఆ 83 సెంట్ల భూమిలో జి+1 ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
హౌసింగ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భవన నిర్మాణాలకు కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడ భవన నిర్మాణాలను ప్రారంభించేశారు. విద్యుత్ అధికారులు ఒక అడుగు ముందుకేసి ఆ నిర్మాణాలకు మీటర్లు కూడా మంజూరు చేసేశారు. అనధి కారికంగా జరుగుతున్న ఈ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ వాసులు కొందరు జిల్లా ఉన్నతాధికారులకు, విజి లెన్‌స అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. భూ బదలా యింపు జరగకుండానే పంట భూమిలో నిర్మాణాలు సాగుతు న్నాయని వారు పేర్కొన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే అనుచరుల్లో అయోమయం
ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు కదా అని వెంటనే ఆయన అనుచరులు సొంత ఖర్చులతో చకచకా పనులు ప్రారంభించేశారు. నిర్మాణం మొదలుపెడితే నిధులు మంజూరవుతాయనుకున్నారు. కానీ ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, నిధులు రాకపోవటంతో డైలమాలో పడ్డారు.
నిబంధనలిలా అతిక్రమించారు
ఇప్పటికీ ఆ 83 సెంట్ల భూమి రైతు పేరిటే ఉంది. అతడి నుంచి ఇప్పటివరకూ ఆ భూమిని పూర్తిగా కొనుగోలు చేయలేదు.
అది వరి పండించే భూమిగానే రెవెన్యూ రికార్డులో ఉంది.
భూ బదలాయింపు అనుమమతులు తీసుకోలేదు.
జి+1 నిర్మాణాలకు మున్సిపల్ అధికారుల అనుమతులు కూడా పొందలేదు.
ఇలా ఏ అనుమతులూ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కూడా మంజూరు చేసేసింది.
ప్రభుత్వానికి నష్టం ఇలా...
స్థలానికి రిజిస్ట్రేషన్ జరగలేదు. పంటభూమి బదలాయింపు కాలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు.
వీటన్నింటి రూపేణా మొత్తం రూ.18 లక్షల మేరకు ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది.
Advertisement