బతుకు మంట | Consider the torch | Sakshi
Sakshi News home page

బతుకు మంట

Published Wed, Jan 14 2015 2:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

బతుకు మంట - Sakshi

బతుకు మంట

కరువుతో గ్రామాలు ఖాళీ
 
ఊరంతా సందడి కనిపిస్తున్నా.. ఆ ఇళ్ల ముందు నిశ్శబ్దం. రంగురంగుల ముగ్గులు.. మధ్యన గొబ్బెమ్మలు..ధాన్యలక్ష్మికి స్వాగతం పలికే ఇళ్లు కొన్నయితే, కాటికి కాళ్లు చాచిన వృద్ధులు.. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారులతో తాళాలు పడిన ఇళ్లు మరికొన్ని. గంగిరెద్దుల సందడి.. ఆటపాటల హడావుడి.. పిండి వంటల ఘుమఘుమలు..

కొత్త బట్టల నవోత్సాహం కొందరిదైతే, బస్సు శబ్దం వస్తే తమ వారెవరైనా వచ్చారేమోనని ఆశగా చూసే కళ్లు.. తమకే మైనా తెచ్చారేమోనని గేరి సందు వరకు పరిగెత్తే పిల్లలు.. పచ్చడి మెతుకులే పంచభక్ష పరమాన్నంలా భావించే బడుగు జీవివులు మరికొందరు. వరుస కరువు వేలాది కుటుంబాల్లో మంట రాజేయగా.. కష్టాల పొంగు కన్నీరై పారుతోంది.
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో సకాలంలో వర్షాలు లేవు. ఆలస్యంగా వచ్చిన వర్షాలకు ఆశపడి సాధారణ సాగు కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే రైతులు పంటలను వేసుకున్నారు. తీరా సమయానికి వర్షాలు రాలేదు. సాగు చేసిన పంటలు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి భారీగా తగ్గిపోయింది.

జిల్లాలోని 54 మండలాల్లో ఏకంగా 34 మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వానికి జిల్లా సర్వోన్నతాధికారి నివేదిక పంపారు. అయితే ప్రభుత్వంకేవలం 12 మండలాల్లోనే కరువున్నట్లు తేల్చింది. వేసిన పంటలు చేతికి రాక... వచ్చిన కాసింత పంటను కూడా తీసుకున్న అప్పుకు పొలం నుంచే వ్యాపారులు తరలించుకుపోయారు. ఈ పరిస్థితుల్లో లోగిళ్లలో పొంగలి దేవుడెరుగు.. పండగ నాడు పచ్చడి మెతుకులూ కరువయ్యాయి.
 
50వేల కుటుంబాలు వలస
ఖరీఫ్‌లో పంటలు దెబ్బతినడంతో చేసిన అప్పును తీర్చేందుకు అనేక మంది వలస బాట పట్టారు. గుంటూ రు, ముంబై, బెంగళూరులకు వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. ఇంటి వద్ద తల్లిదండ్రులను వదిలిపెట్టి... పిల్లలను తీసుకుని పనుల కోసం వలస వెళ్లారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 52వేల కుటుంబాలు వలస వెళ్లాయని ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక సర్వేలోనే తేలింది. కుటుంబానికి సగటున 5గురు చొప్పున లెక్కిస్తే... 52 వేల కుటుంబాలకు అంటే ఏకంగా 2.60 లక్షల మంది పనుల కోసం వలస బాట పట్టారన్నమాట. ఈ సంఖ్య జిల్లా మొత్తం జనాభా(40 లక్షలు)లో ఏకంగా 6.5 శాతం కావడం గమనార్హం.
 
అటు సంబురాలు... ఇటు ధర్నాలు!
ఒకవైపు అవుట్‌డోర్ స్టేడియంలో సంక్రాంతిని పురస్కరించుకుని క్రీడలను, మునిసిపల్ స్కూల్ ఆవరణంలో అట్టహాసంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను మంగళవారం ప్రభుత్వం నిర్వహించింది. మరోవైపు ఇక్కడికి కూతవేటు దూరంలోనే జల మండలి ముందు కేసీ కెనాల్ రైతులు తమకు నీళ్లివ్వండి మహాప్రభో అని నినదించారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా కేసీ కెనాల్‌కు నీరు లేక ఏకంగా 40వేల ఎకరాల పంటలు ఎండుముఖం పట్టాయి.

ఫలితంగా లక్షలాది మంది రైతు కుటుంబాల్లో సంక్రాంతి సంబురాలకు చోటు లేకుండా పోయింది. ఇదే సమయంలో జనవరి నెల పింఛను ఇప్పటికీ పంపిణీ కాక 44వేల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంత్రి పండుగ రోజైన బుధవారం కూడా వీరందరూ పింఛన్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ పోస్టాఫీసుల వద్ద ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఇళ్లల్లో సంక్రాంతి కళతప్పింది.
 
బీద బతుకులకి పండగ, పబ్బం లేదు
నలుగురు కొడుకులు, కొడళ్లు గుంటూరు సుగ్గికి పోయినారు. నేను.. మనవరాలిని సూసుకుంట  ఇంటి కాడనే ఉంటున్నా. సంకరాత్రి పండక్కి వస్తారనుకుంటి, ఇప్పటికీ రానేలేదు. ఇంట్లో తిండిగింజల్లేవు. కొడుకులు, కొడళ్లు లేకుండా పండగెట్లా సేసుకునేది. ఈయేడంత కరువు ఎప్పుడూ సూడలేదు. ఊరంతా పండగ సేసుకుంటున్నారు. బీద బతుకులకు పండగ లేదు.. పబ్బం లేదు.
      - అయ్యమ్మ, ముడుమలగుర్తి
 
పండగ చేసుకునేందుకు ఎవరూ లేరు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రంగమ్మ. గ్రామం ఆలూరు మండల పరిధిలోని హుళేబీడు. కుమారులు పెద్దశేఖన్న, చిన్నశేఖన్న చిన్నకారు రైతులు. ఒక్కొక్కరు రెండు ఎకరాల్లో విడివిడిగా ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు సరిగా పండలేదు. పిల్లాపాపలతో బతికేందుకు బెంగళూరుకు వలస వెళ్లారు. ఇంటి దగ్గర తల్లి రంగమ్మ మాత్రమే మిగిలింది. పండగ చేసుకునేందుకు కుమారులు, కోడళ్లు, మనవళ్లు లేరని బెంగ పెట్టుకుంది.
 - రంగమ్మ, హుళేబీడు గ్రామం
 
నేను, ముసలోడు ఇంటికాడ్నే
బతకడానికి ఇద్దరు కొడుకులు గుంటూరుకె ళ్లి నెలరోజులైంది. ఇంటి కాడ నేను, మా ముసలోడు ఉంటున్నాం. పూటకి తిండి చేసుకోవడమే కష్టంగా ఉంది. అందరూ కలిసుంటేనే పండగ. ఇంట్లో ఒకరుండి, ఒకరు లేకపోతే పండగ ఎట్లా సేసుకునేది. మా ఇళ్ల పక్కన ముపై ్ప, నలభై కుటుంబాలోళ్లు కూడా బతకనీక పోయినారు. గేర్లో ముసలి ముతకలోల్లే మిగిలినారు.
 - సువర్ణమ్మ , ముడుమలగుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement