పోలీస్.. ఫూలిష్‌గా...
కాకినాడ క్రైం : ‘‘పోలీసులు నియంతలా వ్యవహరించకూడదు.. పోలీసు ఇమేజ్ పెంచాలి’’ అంటూ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మూడు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొని పోలీసు సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు చెడ్డపనులు చేస్తే సహించనంటూ హెచ్చరించారు కూడా... అయినా పోలీసు సిబ్బంది తీరులో ‘నో ఛేంజ్’!సర్పవరం పోలీసులు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఇంకా మరువకముందే... బుధవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ ఏకంగా 14 ఏళ్ల బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉన్నతాధికారి ఆదేశాలను సైతం పక్కన పెట్టి సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
తీవ్రగాయాల పాలైన బాలుడు
కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన 12 ఏళ్ల బసల మోహన్ ప్రసాద్, అతడి అక్క పరిమళ సెయింట్ జేవియర్‌స స్కూల్‌లో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వారిద్దరూ, స్నేహితుడితో కలసి కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. అదే దారిలో టూటౌన్ కానిస్టేబుల్ విక్టర్ ఇల్లు ఉంది. అతడి ఇంటి ముందు ఆగి పెద్దగా మాట్లాడుతుండగా విక్టర్ బయటకు వచ్చి గదిమాడు. దీంతో చిన్నారులు ‘‘రోడ్డు మీదేగా మాట్లాడుకుంటున్నాం’’ అన్నారు. వారి సమాధానాన్ని భరించలేని కానిస్టేబుల్ విక్టర్ వారిపై విరుచుకుపడ్డాడు. మోహన్‌ప్రసాద్‌ను కిందపడేసి గుండెలపై తన్నాడు. అడ్డువెళ్లిన పరిమళను దుర్భాషలాడుతూ గెంటివేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని అతడి తల్లి పద్మ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు సూచనమేరకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘గ్రీన్‌ఫీల్డ్ ఘటన మరువకుండానే...
ఇటీవల గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో ముగ్గురు అంధ విద్యార్థులపై ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఘటన మరువకుండానే మరో బాలుడిపై కానిస్టేబుల్ దాడి చేయడం కాకినాడలో చర్చనీయాంశమైంది. సామాన్యులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.