కంపించిన రాజాం
రాజాం రూరల్, రేగిడి, సంతకవిటి: దడదడమంటూ చిన్నపాటి శబ్దాలు.. కాళ్ల కింద ఏదో కదిలిన భావన.. ఆ వెంటనే చిన్న ప్రకంపనలు.. రాత్రివేళ సంభవించిన ఈ పరిణామాలతో రాజాం నియోజకవర్గ ప్రజలు తుళ్లిపడ్డారు. కొద్ది క్షణాల్లోనే అవి భూప్రకంపనలని అర్థమైంది. అంతే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరగంట వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలోని రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో శనివారం రాత్రి 8.53 గంటలకు ఒకసారి, 9.21 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. మొదటిసారి 3 సెకెన్లపాటు, రెండోసారి 2 సెకన్లపాటు కంపించింది.
రాజాం పట్టణంతో పాటు వస్త్రపురి కాలనీ, కొండంపేట, చీకటిపేట, ఒమ్మి, గడిముడిదాం, జీఎంఆర్‌ఐటీ, బుచ్చెంపేట, రేగిడి మండలంలో బాలకవివలస, మునకలవలస, పనసలవలస, కొర్లవలస, పారంపేట, కాగితాపల్లి, బూరాడ, చినశిర్లాం, పెద్దశిర్లాం తదితర ప్రాంతాల్లోనూ, సంతకవిటి మండలం మోదుగుల పేట, బొద్దూరు, గుళ్లసీతారాంపురం, పొనుగుటివలస, బిళ్లాని, తలతంపర, ఇజ్జిపేట, తదితర గ్రామాల్లో ప్రకంపనలు సంభవించాయి. శబ్దాలు, కదలికలతో నిద్రపోతున్న చిన్నారులు ఏడుస్తూ లేచిపోగా అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న వృద్ధులతోపాటు ఇళ్లలో ఉన్న మహిళలు, పురుషులు పిల్లలను పట్టుకొని బయటకు పరుగులు తీశారు. మొదటిసారి ప్రకంపనలు సంభవించినప్పుడు బయటకు వచ్చేసిన వారు కొద్దిసేపటికి తేరుకొని ఇళ్లలోకి వెళుతుండగానే మళ్లీ 9.21 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించడంతో మరోసారి బయటకు పరుగులు తీశారు. రాత్రి పదిన్నర, పదకొండు గంటల వరకు భయంతో ఆరుబయలు ప్రాంతాల్లోనే కాలక్షేపం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం లేదు.