సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై ఇక నిరంతర పర్యవేక్షణ ప్రారంభం కానుంది. క్షేత్ర స్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించే మండల విద్యాధికారులు (ఎంఈఓ)లు లేకపోవడంతో అనేక ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో పాఠశాలల పర్యవేక్షణకు ప్రాథమిక విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రతి మండలంలో ఉండే క్లస్టర్ రీసోర్సు పర్సన్ల(సీఆర్‌పీ) సహకారంతో పక్కాగా పాఠశాలల పర్యవేక్షణ చేపట్టాల ని నిర్ణయించింది. ఒక్కో సీఆర్‌పీ రోజూ ఒక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఆన్‌లైన్ ద్వారా తెలియజేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.
పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం మొదలుకొని హాజరైన టీచర్లు, పాఠ్యాంశాల బోధన, మధ్యాహ్నభోజనం, నిధుల ఖర్చు వంటి 19 అంశాలపై వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడం ద్వారా పాఠశాలల్లో ఉండే సమస్యలను విద్యా శాఖ పరిష్కరించనుంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఈ ప్రత్యేక పర్యవేక్షణను అక్టోబరులో ప్రారంభించనున్నట్లు ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మండలాల్లోని సీఆర్‌పీలు తమ పరిధిలో రోజుకు ఒక స్కూల్‌ను సందర్శించి వివరాలను సేకరించి ప్రత్యేక ఫార్మాట్ కలిగిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారని చెప్పారు. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టడం ద్వారా స్కూళ్ల ను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
అక్టోబర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర పర్యవేక్షణ
Published Mon, Sep 23 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement