మంచి మాట
బతికి ఉన్నంత కాలం అన్నం తినటం ఎంత అవసరమో శుచిగా ఉండటం అంతే అవసరం. శుచిగా ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి ఆపితే మకిలి పేరుకు పోతుంది. తరువాత యథాస్థితికి తేవటానికి సమయం చాలా అవసర మౌతుంది. రాగిచెంబుని ఎంత తోమితే అంత మెరుస్తుంది అని ఒక నానుడి. రాగిచెంబే కాదు జీవితమైనా అంతే. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇల్లయినా, ఒళ్లయినా, సమాజమైనా, దేశమైనా, మరేదైనా సరే!
భౌతికమైన అంటే పరిసరాల, శారీరక శౌచం మాత్రమే కాదు మనసుని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. జీవప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యర్థాలు వెలువడటం సహజం. వాటిని ఎప్పటి కప్పుడు తొలగించక పోతే చెత్త పేరుకుపోతుంది. ఆరోగ్యం పాడవటం జరుగుతుంది. మనసు కూడా బాగా పని చేసినప్పుడు మథనంలో కావలసిన ఆలోచనలతో పాటు అక్కర లేనివి కూడా వస్తాయి. వాటిని పరిహరించక పోతే బుర్ర చెడి పోతుంది.
ఒక్కక్షణం ఏమరుపాటు కలిగినా జరగవలసిన హాని జరిగిపోతుంది. మనకి మిత్రులలాగా కనపడుతూ కీడు చేసే శత్రువులు అవకాశం కోసం ఎదురు చూస్తూ తొంగిచూస్తూ ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనసులో తిష్ఠవేసుకుని కూర్చుంటారు. ఆ శత్రువుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కాలంగా సాధన చేశాను, ఇంకెంత కాలం నియమ నిష్ఠలతో సాధన చెయ్యాలి? ఇంక చాలు – అంటూ ఉంటారు కొంతమంది.
పుట్టినప్పటి నుండి గాలి పీలుస్తూనే ఉన్నాం కదా, ఇక గాలి పీల్చటం మానేద్దాం అని ఎవరైనా అనుకుంటారా? ఆఖరిక్షణం వరకు వీలైనంతగా కొనసాగించ వలసిందే. ఒక్కక్షణం ఆపితే ..? ఇంకేముంది? ఆ తరువాత గాలి పీల్చవలసిన పని ఉండదు. ఎందుకంటే గాలి పీల్చటం ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేయటమే.
అందుకే అన్ని సంప్రదాయాల్లోను శౌచం అనే దానికి చాలా ్రపాధాన్యం ఉంది. అది పరిసరాలతో ్రపారంభమై శరీరం, మనస్సు, ఆత్మల వరకు విస్తరిస్తుంది. దీనిని సూచించటానికే జీసస్ పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఒకటి కనపడుతుంది. అదేవిధంగా షిరిడీ సాయి బాబా కూడా పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఉంటుంది.
వాళ్ళకి ఎంగిలిపళ్ళాలు కడగవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం ఎవరికైనా ఎప్పుడయినా వచ్చిందా?
వాళ్ళు కడుగుతున్నది తమ శిష్యులు, లేక భక్తులు, లేక అనుయాయుల మనస్సులని కప్పిన పాపాలనే మలినాలని. పాపరహితులైన వారే నిరంతరం శుభ్రం చేయటానికి ్రపాధాన్యం ఇస్తూ ఉంటే సామాన్యుల మైన మనవంటి వార మెంత?పుట్టినప్పుడున్నంత నిష్కల్మషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే అప్పటి వరకు చేసినదంతా తుడిచి పెట్టుకు పోతుంది. రోజూ తుడుస్తున్న అద్దాన్ని ఒక్కసారి తుడవకపోతే దుమ్ము΄÷ర ఉండి దానిలో ప్రతిబింబం సరిగ్గా కనపడదు. ఇది అందరికి ప్రత్యక్ష ప్రమాణం. అదే మనస్సనే అద్దం మీద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మలినాలు ఉంటే దానిలో పరమాత్మ రూపం సరిగ్గా ప్రతిఫలిస్తుందా? ఎన్నో మార్పులతో కనిపిస్తుంది.
అందుకే సాధకులకి ఒక్కొక్కరికి దైవం ఒక్కొక్క విధంగా ఉన్నట్టు తోస్తుంది. వీటికితోడు అహంకార మమకారాలు ఆడే నాటకాలు కూడా తక్కువేమీ కావు. ఈ ΄÷రలు కప్పి ఉండటం వల్లనే ఎన్నో వికల్పాలు కలుగుతూ ఉంటాయి. కనుకనే వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే అదే సహజమైన రూపం అని భ్రమపడే ప్రమాదం ఉంది. ఈ భ్రమప్రమాదాల కారణంగా సాధన పెడత్రోవ పట్టే అవకాశం ఉంది.
– డా.ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment