సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అన్ని రంగాలలో ఇందూరును ప్రగతి పథాన నడిపించేందుకు కృషి చేస్తున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నామని, విద్య, వైద్య రంగాలకూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువా రం నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు * 3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే 19 మండలాల పరిధిలోని 134 గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు.
అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి పనులు పూర్తయితే జిల్లాలో 22 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు ఇప్పటికి * 263 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరుందని, ఖరీఫ్‌లో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని పేర్కొన్నారు. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారడంతో రైతుల కళ్ల లో ఆనందం తొణికిసలాడుతోందన్నారు.
సంక్షేమ ఫలాలు..
రైతులకు 50 శాతం రాయితీపై 69 వేల క్వింటా ళ్ల విత్తనాలు, 1.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామని మంత్రి వివరించా రు. రైతుశ్రీ పథకం కింద లక్ష రూపాయల వర కు వడ్డీలేని పంట రుణాలు, * 3 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికి * 472 కోట్ల రుణాలిచ్చా మన్నారు. యంత్రలక్ష్మి పథకం కింద రైతులకు 50 శాతం రాయితీపై * 6 కోట్ల విలువ చేసే ఆధునిక యంత్రాలు అందించామన్నారు. పశుక్రాంతిలో పేద రైతులకు 1,085 పాడి పశువులను అందించామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 49 వేల మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందారన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా 13 వేల మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికి 2.300 మందికి శిక్షణ ఇచ్చామని, 1,900 మందికి ఉపాధి చూపించామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది *122 కోట్లతో 2 లక్షల కుటుంబాలకు 83 లక్షల పని దినాలు కల్పించామన్నారు.
వైద్య కళాశాలకు..
జిల్లాకు మంజూరైన వైద్యకళాశాలలో 100 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. దీనికి అనుబంధంగా 500 పడకల ఆధునిక వైద్యశాలను ఏర్పాటు చేసి, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వసతుల కల్పన కోసం ఈ ఏడాది * 85 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. బంగారు తల్లి పథకం కోసం జిల్లాలో ఇప్పటివరకు 750 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా 1,028 అంగన్‌వాడీ కేంద్రాలలో 11 వేల మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా జిల్లాలో 56 వేల మరుగుదొడ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికి 13 వేలు నిర్మించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ద్వారా 3 విడతల్లో 87 వేల ఇళ్లు పూర్తి చేశామని, మరో 27 వేలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. వ్యవసాయానికి 7 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన పోలీసు శాఖను ఆయన అభినందించారు.
ఉత్తమ సేవలకు ‘ప్రశంస’
ఉత్తమ సేవలందించిన 249 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పోలీసులకు కార్యక్రమంలో ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో * 20 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను, అభయహస్తం ద్వారా *6.63 కోట్ల స్కాలర్‌షిప్‌లను మంత్రి పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్, డీఐజీ అనిల్‌కుమార్, ఎస్పీ మోహన్‌రావు, జిల్లా జడ్జి షమీమ్ అక్తర్, ఏజేసీ శేషాద్రి, డీఆర్‌ఓ జయరామయ్య, డీసీసీబీ చైర్మ న్ పట్వారి గంగాధర్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీ బుద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, నాయకులు తాహెర్‌బిన్ హందాన్, పల్లె గంగారెడ్డి, తిరుపతిరెడ్డి, గడుగు గంగాధర్, అరుణతార తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి కోసం నిరంతర శ్రమ
Published Fri, Aug 16 2013 4:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement