కోటరీ నేత దందా !
కాంగ్రెస్ ఓటమి పాలవడంతో..రాజ్యాంగేతర శక్తిగా పెత్తనం చెలాయించిన షాడో నేత బాధ వదిలిందని భావించిన అధికారులకు ఇప్పుడు ఓ ‘చంటి’ నేత దాపురించాడు. ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులను అయినదానికి, కానిదానికీ పీడిస్తూ నానా యాగీచేస్తున్నా డు. నోటికి వచ్చినట్టు ఆదేశాలు జారీ చేస్తూ... రాజు గారి మనిషిగా దందా చేస్తున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసి, అధిక మొత్తంలో బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఉద్యోగుల బదిలీల విషయంలో తలదూర్చి తనకు నచ్చిన వారిని తీసుకొచ్చేందుకు అధికారులపై ఒత్తిళ్లకు దిగుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక రాజకీయ కాంట్రాక్టర్. ఏ ఎండకాగొడుగు పట్టేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు. ఎంచక్కా కాంట్రాక్ట్‌లు దక్కించుకుంటారు. స్వతహాగా టీడీపీ నాయకుడైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలను మచ్చిక చేసుకుని, ముడుపులు ముట్టజెప్పి పనులు చేయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అశోక్ బంగ్లా మనిషిగా చెప్పుకుని దందా ప్రారంభించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెలరేగిపోతున్నారు. ఇంజినీరింగ్ అధికారులపై అజమాయిషీ చెలాయిస్తున్నారు. చెప్పినట్టు నడుచుకోవాలని వారిని బెదిరిస్తున్నారు. కోరిన విధంగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లే దంటే స్థానచలనం తప్పదని హెచ్చరిస్తున్నారు. జెడ్పీ పాలకులపైనా ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫలానా ఇంజినీర్‌ను నియమించాలని సిఫారసు చేస్తున్నారు. ఈయ న గారి భాగోతాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద ఇటీవల ఒక టీడీపీ కౌన్సి లర్ ప్రస్తావించారు. ఆయన చేస్తున్న నిర్వాకాలను వివరించే ప్రయత్నం చేశారు.
బంగ్లాలో ఆయనదే హడావుడి
అశోక్ బంగ్లాను నిత్యం అంటిపెట్టుకుని ఉంటారు. కోటరీలో ఆయనొకరుగా చెలామణి అవుతున్నారు. టీడీపీ కార్యక్రమాలేం జరిగినా ఆయన హడావుడి అంతాఇంతా కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకెదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన వృత్తికి సంబంధం గల ఇంజినీరింగ్ శాఖలపై పెత్తన ం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పనులొచ్చినా తనకు తెలియాలని, తన కన్నుసన్నల్లో కాంట్రాక్ట్‌లు ఖరారు చేయాలని, పనుల పర్యవేక్షణలో చెప్పినట్టుగా నడుచుకోవాలని, కోరిన విధంగా బిల్లులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. లేదంటే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు.
బిల్లుల కోసం ఒత్తిళ్లు
పూసపాటిరేగలో రూ. 5 లక్షల విలువైన మరమ్మతు పనులు చేసి రూ. 25 లక్షల బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం పట్టణ శివారులో వేసిన రోడ్డుకు ఉమ్మితడి మరమ్మతులు చేసి పెద్ద ఎత్తున బిల్లు గుంజుతున్నారు. భోగాపురంలోని రూ.5 కోట్ల వర్కు కోసం అక్కడి నేతలపైనా ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి ఆగడాలు అనేకం ఉన్నాయి. టీడీపీ నేతలం దరికీ ఈయన వ్యవహారం తెలిసినా రాజుగోరు మనిషి అని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఇటీవల టీడీపీ కౌన్సిలర్ ఒకరు కాస్త జోక్యం చేసుకుని సదరు కాంట్రాక్ట్ గుట్టు అంతా అశోక్ వద్ద విప్పేందుకు ప్రయత్నించారు. తోటి కౌన్సిలర్లు, నాయకులు అడ్డు తగలకపోయి ఉంటే ఆయన యవ్వారమంతా బయటపడేది.
జెడ్పీ పాలకులపైనా ....
ప్రస్తుతం బదిలీల సీజన్ కావడంతో ఇంజినీరింగ్ శాఖలో హవా సాగాలని ప్రయత్నిస్తున్నారు. తనకు కావల్సిన ఇంజినీరింగ్ అధికారులను వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లా మనిషిగా చెప్పుకుని జెడ్పీ పాలకులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఎవరెవర్ని ఎక్కడ వేయాలో, ఈఈలగా ఎవరి వేయాలో సిఫారసు చేస్తున్నారు.
పెద్దాయన మాటగా చెప్పుకుని హల్‌చల్ చేస్తున్నారు. కాక పోతే ఈయన గారి వ్యవహారంతో జెడ్పీ పాలకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక్కడ ఆయన పెత్తనమేంటని అంతర్మధన ం చెందుతున్నారు. బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈయన గారి తీరుపై టీడీపీ నేతల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులంతా బంగ్లాలోని చెట్లు కిందే కాలం వెళ్లదీస్తున్నారని, ఆయన మాత్రం దర్జాగా అన్నీ అవకాశాలను పొందుతున్నారని ఆవేదన చెందుతున్నారు.