
అదుపులో ప్రధాన స్మగ్లర్?
=‘ఎర్ర’కూలీల ద్వారా ఆచూకీ లభ్యం
=దుబాయ్‌లో తలదాచుకున్న మరికొంత మంది స్మగ్లర్లు
సాక్షి, తిరుపతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపడంతో, ఒక ప్రధాన స్మగ్లర్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. ఇతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇతని నుంచి అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అధికారుల హత్యకు సంబంధించిన సమాచారం కూడా ఇతని ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
శనివారం భాకరాపేట వద్ద ఎర్ర కూలీలను సరఫరా చేసే మేస్త్రీ పట్టుబడగా, పోలీసులు అత డిని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఒక ప్రధాన స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని, రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. అతని ద్వారా కొన్ని పేర్లు పోలీసులకు లభించినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌కు వెళ్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక అధికారి మాట్లాడుతూ దుబాయ్‌లో దాక్కుని ఉన్న వారిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. వీరి ఆచూకీ కోసం దుబాయ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు.
తాము ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడంతో వీరు దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు. అయితే ఎవరినీ వదిలేది లేదని చెప్పారు. ఇదిలా ఉండగా, పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కూలీలపై లాఠీలను ఝుళిపిస్తున్నారు. ఆదివారం జరిగిన కూంబింగ్‌లో శేషాచలంలో కొంతమంది ఎర్ర కూలీలను పోలీసులు, అటవీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేసినట్లు తెలిసింది.
వీరు పారిపోయే ప్రయత్నం చేయగా, లాఠీలు ఉపయోగించినట్లు తెలిసింది. ఇద్దరు అధికారులను పొట్టన పెట్టుకోవడంతో పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల అంతు తే ల్చాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన వారిని, ప్రధాన స్మగ్లర్‌ను కూడా సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.