సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడుతూ.. కరోనా మహమ్మరి కారణంగా ఈసారి బడ్జెట్ అంచనాలు 1.4 శాతం తగ్గాయని వెల్లడించారు.
2020-21 ఏడాదికిగాను రూ.2,24,789.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఇందులో రెవిన్యూ లోటు రూ.18,434.14 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపారు. ఆర్థిక లోటు దాదాపు రూ. 48,295.58 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.78 శాతం ఆర్థిక లోటు, 1.82 శాతం రెవిన్యూ లోటుగా ఉంటుందని చెప్పారు.
(చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్)
2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సారానికి సంబంధించి డివిజబుల్ పూల్‌లో తగ్గిన వాటాతోపాటు, కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్‌డౌన్ చర్యలతో తగ్గుముఖం పట్టిన ఆదాయ వనరులు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేశాయని అన్నారు. అయితే, నేను ఈ సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి కింది వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.
‘ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటల్ని ఆర్థిక మంత్రి బుగ్గన ఉటంకించారు.
2020-21 బడ్జెట్ అంచనాలు
- 2,24,789.19 కోట్లతో బడ్జెట్
- 1,80,392.65 కోట్ల రెవెన్యూ వ్యయం
- 44,396.54 కోట్ల పెట్టుబడి వ్యయం
సవరించిన అంచనాలు 2019-20
- రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
- మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
- రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
- ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
- ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం
Comments
Please login to add a commentAdd a comment