కార్పొ‘రేటు’ | corporate | Sakshi
Sakshi News home page

కార్పొ‘రేటు’

Published Sat, Feb 14 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

corporate

కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో వసూళ్ల దందా కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో మార్కులేయిస్తామని విద్యార్థుల నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్ పరీక్షల విధులకు హాజరయ్యే అయ్యవార్లకూ భారీగా నజరానాలు ముట్టజెబుతున్నారు. నాన్ జంబ్లింగ్ విదానంలో కొన్నేళ్లుగా ఈ దందా నడుస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు.
 
 ఎంసెట్‌లో ఇంటర్ మీడియట్ మార్కులే కొలమానం. ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల్లో థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్ష ల్లోనూ విద్యార్థులు ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో ర్యాంకులే పరమావధిగా ఉన్న కార్పొరేట్ కాలేజీలు కొన్ని పరీక్షల్లో మార్కుల కోసం అడ్డదార్లు తొక్కుతున్నాయి. విద్యార్థికి కోరిన మేరకు ఫుల్‌గా మార్కులు వేస్తే నజరానాలు, కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఫిర్యాదులు చేసి విధుల నుంచి తీయించేందుకు సైతం వెనుకాడటం లేదు. జిల్లాలో ఈ నెల 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు 4 విడతల్లో ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను 38 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 41 ప్రభుత్వ, 71 ఎయిడెడ్, 2 కో ఆపరేటివ్ కాలేజిలు, 30 ఆదర్శ పాఠశాలలు, 12 ఏపీఎస్‌డబ్ల్యుఆర్‌జెసి కాలేజిలు, 3 ఏపీటీడబ్ల్యుఆర్‌జేసీ కాలేజిలు, 4 ఇన్‌సెంటింగ్ కాలేజీలు, 8 వృత్తి విద్యా కళాశాలలు, 99 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 212 కాలేజీలు ఉన్నాయి.
 
 ఈ కళాశాలల్లో జనరల్ విద్యార్థులు 25,850, వొకేషనల్ విద్యార్థులు 3,900 మంది హాజరవుతున్నారు. మొదటి విడత పరీక్షలు 12 నుంచి 16 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత 23 నుంచి 27 వరకు, నాల్గవ విడత 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డీవో, ఒక సీఎస్‌ను నియమిస్తారు. దీంతో పాటు పరీక్ష జరిగే సమయంలో ఒక్కో కాలేజికి నలుగురు ప్రాక్టికల్ ఎగ్జామినర్లను నియమిస్తారు. పరీక్షల పర్యవేక్షణకు గాను డీవీఈవో, ఆర్‌ఐవోతో పాటు ఒక హెచ్‌బీసీ మెంబర్, ముగ్గురు డీఈసీ మెంబర్లు, ఇద్దరు సభ్యులుండే రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి.
 
 ప్రాక్టికల్స్ డ్యూటీలకు పైరవీలు
 ప్రాక్టికల్స్ ఎగ్జామినర్ల డ్యూటీలు వేయించడంలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు భారీగా పైరవీలు చేస్తాయన్న విమర్శ ఉంది. వారికి కావాల్సిన రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను సేకరించి, ఇంటర్ మీడియట్ బోర్డులో పైరవీలు చేసి, వారినే తమ కాలేజీలో డ్యూటీలు వేయించుకుంటున్నారు. విధులకు హాజరైన ఎగ్జామినర్లకు మంచి బోజనం, స్నాక్స్, టీ, కాఫీలు, కూల్‌డ్రింక్‌లు ఇస్తూ సకల మర్యాదలు చేస్తారు. నాలుగు రోజుల విధులు ముగిసిన తర్వాత ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ముట్టజెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో సబ్జక్టును బట్టి ఈ రేటు మారుతోంది.
 
 ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు వసూలు..!
 ఎగ్జామినర్ల నియామకానికి, వారితో విద్యార్థులకు మంచి మార్కులు వేయించడానికి కార్పొరేట్ కాలేజీలు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. ఇలా ఖర్చు పెట్టిన డబ్బును కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రాబడుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్షల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారు.
 
 తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ప్రాక్టికల్స్ పూర్తిస్థాయి మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యాలు అడిగిన మేర డబ్బును కాదనకుండా ఇస్తున్నారు. వాస్తవానికి ఇంటర్ మీడియట్ విద్య అంటేనే థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. కాలేజీ అడ్మిషన్ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేసే కాలేజీలు ప్రాక్టికల్ మార్కులకు మళ్లీ డబ్బులు వసూలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
 
 చోద్యం చూస్తున్న అధికారులు
 ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అక్రమాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చూడ్డానికి పర్యవేక్షణ కమిటిలతో హడలెత్తిస్తున్నా ఏ ఒక్క కాలేజీపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. థియరీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి నామమాత్రంగా ప్రాక్టికల్స్ చేయించే కాలేజీల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి మార్కులు ఎలా వస్తాయన్న కనీస పరిజ్ఞానం అధికారులకు ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్స్ అంతా ప్రశాంతంగా జరిగాయని ప్రకటనలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement