మాయగాడితో జర జాగ్రత్త! | corporate college lecturer cheating women in cadapa town | Sakshi
Sakshi News home page

మాయగాడితో జర జాగ్రత్త!

Published Thu, Jun 25 2015 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

మూడు పదుల వయసు కలిగి ‘చంద్రు’డివలె చక్కగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల అధ్యాపకుడు తన వాక్చాతుర్యంతో విద్యార్థినులను లోబరుచుకుంటున్న వైనం వెలుగు చూసింది.

కడప అర్బన్ :  మూడు పదుల వయసు కలిగి ‘చంద్రు’డివలె చక్కగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల అధ్యాపకుడు తన వాక్చాతుర్యంతో విద్యార్థినులను లోబరుచుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఇతగాడి స్వస్థలం ప్రకాశం జిల్లా పెద్ద పలని. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువతితో 2009లో వివాహమైంది. ఆమె నెల్లూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకురాలు. ఇతనూ అక్కడే ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తూ ఇటీవల తిరుపతిలోని ఓ కార్పొరేట్ కళాశాలకు మారాడు.
 
కడప నగరానికి చెందిన ఓ యువతి ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రెండు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని ఓ కళాశాలలో చేరింది. ఇతగాని మాయలో పడి 20 రోజుల క్రితం అతనితో వెళ్లింది. ఆ యువతి తల్లిదండ్రుల నుంచి తనకు ఇబ్బంది ఎదురవ్వచ్చని ఊహించి తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. మరో వైపు తన తల్లిదండ్రుల నుంచి తనకు హాని ఉందని ఆ యువతి హైకోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఈ అధ్యాపకుడిని, ఆ యువతిని కడప మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ పిలిపించారు. ఆ విషయం తెలుసుకున్న అధ్యాపకుడి భార్య బుధవారం నెల్లూరు నుంచి హుటాహుటిన కడప చేరుకుంది. తన భర్త వల్ల తాను చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నానని కన్నీటి పర్యంతమైంది. తమకు ఐదేళ్ల బాబు, ఐదు నెలల పాప ఉన్నారని, తన భర్త తీరును మార్చి తనతో పంపాలని వేడుకుంది. ఇతగాడిపై ఫిర్యాదు చేయడానికి భార్య, అటు ఆ యువతి ఇద్దరూ ఇష్టపడలేదు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక అధ్యాపక దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
 
భవిష్యత్ పాడు చేసుకోవద్దని ఆ యువతిని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, సూటు.. బూటుతో చక్కగా ఉన్న ఈ అధ్యాపకుడిపై ఫిర్యాదు లేని కారణంగా ఎలాంటి చర్య తీసుకోలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి మాయలో పడకుండా విద్యార్థినుల తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. విద్యార్థినులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ విలాసవంతమైన జీవితం రుచి చూపిస్తూ లోబరుచుకునేవాడని, తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి బంగారు ఆభరణాలు కాజేసేవాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. మరోమారు తప్పిదానికి పాల్పడితే సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు అతగాడికి గట్టిగా హెచ్చరించి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement