ఎత్తిపోతల పథకం నుంచి తోడుతున్న నక్కల డ్రెయిన్ నీరు
యలమంచిలి : పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఉప్పునీరువల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు.
కారణం ఏమిటంటే..
పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 2,088 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ పొలాలకు నక్కల డ్రెయిన్ నీటిని చించినాడ కాల్వలోకి తోడి పంట చేలకు ఇస్తున్నారు. అయితే నక్కల డ్రెయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంతో పంటలు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనిపై గత డిసెంబర్‌లోనే దాళ్వాకు నక్కల డ్రెయిన్ నీటిని ఎత్తిపోయవద్దని అధికారులను వేడుకున్నారు. డిసెంబర్ 27న పెనుమర్రు ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చిన నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి తమ గోడు విన్నవించుకున్నారు. రూ.కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నీరు తమకు వద్దని రైతులు స్పష్టం చేశారు. దీనిపై ఆయన రైతులను ప్రశ్నించగా, నక్కల డ్రయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా చేలకు తోడితే పైరు చౌడు బారిపోతుందని చెప్పారు. దిగుబడీ గణనీయంగా తగ్గుతుందన్నారు.
దీంతో ఆయన నక్కల డ్రెయిన్‌లోని నీటిని పరీక్ష చేయించగా 0.8 శాతం ఉప్పు సాంద్రత ఉన్నట్టు నివేదిక వచ్చింది. దీనిపై వ్యవసాయ అధికారి జాన్సన్‌ను పిలిచి వరి సాగుకు ఎంత ఉప్పు శాతం ఉండవచ్చునని అడగ్గా 4 శాతం వరకూ ఉండవచ్చని చెప్పారు. దీంతో గాంధీ జనవరి 10వ తేదీ వరకు దమ్ములు పూర్తి కావడానికి మాత్రమే ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తోడతామని రైతులకు చెప్పారు. ప్రస్తుతం 0.8 శాతం మాత్రమే ఉప్పు ఉంది కాబట్టి పరీక్ష యంత్రాన్ని నీటి సంఘ అధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు వద్ద ఉంచుతామని, జనవరి 10 లోపు ఎప్పుడు రెండు శాతానికి మించి ఉప్పు వచ్చినా వెంటనే మోటార్లు ఆపివేస్తామని హామీనిచ్చారు. అక్కడి నుంచి మార్చి 31వ తేదీ వరకు పంటకాల్వ నీరే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఆ హామీలు అమలు కాలేదు. మార్చి వచ్చినా ఎత్తిపోతల నీటినే తోడుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
మోసం చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వడం వలన రైతులు నష్టాలపాలవుతున్నారు. అందుకే నారుమడలు వేయకుండానే సాగు చేయలేమని చెప్పారు. సాక్షాత్తు సబ్ కలెక్టర్ వచ్చి దమ్ముల వరకే ఎత్తిపోతల పథకం నీరు తోడతామని, మార్చి నెలాఖరు వరకు కాల్వ నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నమ్మి సాగుచేసి మోసపోయారు. – తోటకూర వెంకట్రామరాజు, మాజీ సర్పంచ్, పెనుమర్రు
నక్కల డ్రెయిన్‌లో 5శాతం ఉప్పు ఉంది
పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టులో రావిపాడు, పెనుమర్రు, మేడపాడు, యలమంచిలి, కట్టుపాలెం, శిరగాలపల్లి గ్రామాలలో 2,088 ఎకరాలు సాగవుతోంది. నక్కల డ్రెయిన్ నీటిలో 5 శాతం ఉప్పు ఉంది. ఆ నీటిని పంట చేలకు పెడితే గింజలన్నీ చౌడుబారి పోయి రైతులు నష్టపోతారు. కాల్వ నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల నుంచి నీరు తోడవద్దని రైతులు ఎంత మొత్తుకుంటున్నా అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యంలా ఉన్నాయి. – పాకా సూర్యనారాయణ, రైతు
Comments
Please login to add a commentAdd a comment